logo

అనవసర రుణం.. అప్పులపాలయ్యే మార్గం!

స్వయం సహాయక మహిళా సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వడ్డీలేకుండా ప్రభుత్వం బ్యాంకు అనుసంధాన(లింకేజీ) రుణాలను అందిస్తోంది. ఇందుకోసం సెర్ప్‌ ఉద్యోగులు గ్రామాల్లో సంఘాల్లోని మహిళలకు అవగాహన కల్పించి వారికి రుణాలను అందిస్తున్నారు

Published : 27 Nov 2022 05:07 IST

ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే

స్వయం సహాయక మహిళా సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వడ్డీలేకుండా ప్రభుత్వం బ్యాంకు అనుసంధాన(లింకేజీ) రుణాలను అందిస్తోంది. ఇందుకోసం సెర్ప్‌ ఉద్యోగులు గ్రామాల్లో సంఘాల్లోని మహిళలకు అవగాహన కల్పించి వారికి రుణాలను అందిస్తున్నారు. రుణాలతో వారు వివిధ వ్యాపారాలు, అవసరాలను తీర్చుకొని తిరిగి నెలవారీ పద్ధతిలో చెల్లిస్తున్నారు. వీటి పర్యవేక్షణకు, మహిళలను చైతన్యం చేసేందుకు గ్రామస్థాయిలో సీసీలు, మండల స్థాయిలో ఏపీఎంలు, జిల్లా స్థాయిలో డీపీఎంలు ఉంటారు. కానీ రుణ లక్ష్యాలు పెంచుతూ సెర్ప్‌ అధికారులు ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ఆ శాఖ ఉద్యోగుల ఐకాస ఆందోళన బాట పట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డీఆర్డీవోలకు తమ సమస్యలు వివరిస్తూ వినతిపత్రాలు అందించింది.

నవంబరులో భారీగా పెంపు

క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల వాస్తవ అవసరాల ఆధారంగా సూక్ష్మరుణ ప్రణాళికలను ఏటా తయారు చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు రుణలక్ష్యాన్ని విధించారు. ఉన్నట్టుండి సెర్ప్‌ అధికారులు నవంబర్‌ నెలలో రుణలక్ష్యాన్ని భారీగా పెంచారు. కానీ సంఘాల సంఖ్య పెంచలేదు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా పెంచడంతో లక్ష్యాన్ని సాధించడానికి సెర్ప్‌ అధికారులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది.

అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజులు చెల్లించాలిమహిళా సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీతో పాటు ఇదే సెర్ప్‌లోని ఇతర విభాగాలు స్త్రీనిధి, మండల సమైక్య, మైక్రోఫైనాన్స్‌ నుంచి రుణాలు తీసుకుంటారు. వీటిని నెలవారీగా క్రమంతప్పకుండా చెల్లించాలి. ఇలా రుణలక్ష్యాన్ని పెంచడం వల్ల అవసరం లేకున్నా మహిళలు రుణాలను తీసుకుంటే ఆయా సంఘాల్లోని సభ్యులు అప్పుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్‌పీఏ సైతం ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ఇలా అవసరం లేకున్నా రుణాలను మంజూరు చేయడం వల్ల బ్యాంకులకు అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజులు చెల్లించాల్సి వస్తుంది.

మహిళా సంఘాలకు అందించే అనుసంధాన రుణలక్ష్యాన్ని ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెంచారు. సెర్ప్‌ ఉన్నతాధికారులు ఇచ్చిన లక్ష్యాన్ని చేరేందుకు ఉద్యోగులు పనిచేయాలి. అర్హత కలిగిన ప్రతి మహిళకు రుణాన్ని అందించాలి.
విద్యాచందన, డీఆర్డీవో


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని