logo

పాడి రైతులకు రూ.కోట్లలో కుచ్చుటోపి..!

ఖమ్మం జిల్లాలో పలు గ్రామాలకు చెందిన పాడి రైతులు ఓ దళారీ చేతిలో మోసపోయిన ఘటన మధిరలో శనివారం వెలుగులోకి వచ్చింది. బాధిత రైతుల కథనం ప్రకారం..

Published : 27 Nov 2022 05:07 IST

రుణాలు చెల్లించాలని పీఎన్‌బీ నుంచి నోటీసులు అందుకున్న రైతులు

మధిర, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలో పలు గ్రామాలకు చెందిన పాడి రైతులు ఓ దళారీ చేతిలో మోసపోయిన ఘటన మధిరలో శనివారం వెలుగులోకి వచ్చింది. బాధిత రైతుల కథనం ప్రకారం.. మధిర మండలంలోని అంబారుపేట, జిలుగుమాడు, బుచ్చిరెడ్డిపాలెం, సిరిపురం, బోనకల్లు మండలంలోని రాపల్లి, బ్రాహ్మణపల్లితోపాటు సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు గ్రామాల పాడిరైతులను ఐదేళ్ల క్రితం బాషా అనే వ్యక్తి గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి సభ్యులుగా చేర్చుకున్నాడు. ఖమ్మంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.30 వేల చొప్పున రుణం ఇప్పించాడు. రైతులు ఏనాడూ ఆ బ్యాంకు మెట్లు ఎక్కలేదు. పాల సేకరణ కేంద్రాల నుంచి రైతులకు ప్రతి పది రోజులకు రావాల్సిన బిల్లును బ్యాంకులో జమ చేస్తున్నానంటూ బాషా నమ్మబలికాడు. కొన్నేళ్ల తర్వాత బాకీ తీరిపోయిందని తెలిపాడు. రెండేళ్ల క్రితం ముఖం చాటేసి సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి వెళ్లాడు. ఒక్కో రైతు రూ.90వేల నుంచి రూ.లక్షన్నర చొప్పున బాకీ ఉన్నట్లు ఇటీవల బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. ఈ నెల 7వరకు బాకీ చెల్లించాలని నోటీసుల్లో ఉంది. పాలుపోని రైతులు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. బాధిత రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం వెంకటేశ్వరరావు, సీపీఎం నాయకుడు శీలం నర్సింహారావు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని