logo

గుండాల ఎంపీటీసీ సభ్యుడు హఠాన్మరణం

తెదేపా సీనియర్‌ నాయకుడు, గుండాల ఎంపీటీసీ ఎస్‌కే సంధాని (55) శనివారం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. గుండాల నుంచి సొంత జీపులో ఇల్లెందు వెళ్లారు

Published : 27 Nov 2022 05:15 IST

సంధాని

గుండాల, న్యూస్‌టుడే: తెదేపా సీనియర్‌ నాయకుడు, గుండాల ఎంపీటీసీ ఎస్‌కే సంధాని (55) శనివారం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. గుండాల నుంచి సొంత జీపులో ఇల్లెందు వెళ్లారు. అక్కడినుంచి తన స్నేహితుని కారులో కొత్తగూడెం వెళ్తుండగా టేకులపల్లి మండలం సులానగర్‌ వద్ద గుండెపోటుకు గురయ్యారు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అతణ్ని అదే కారులో కొత్తగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య సల్మా, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంధాని స్వస్థలం గుండాల.

స్పందించే మనస్తత్వం..: ఆపదొస్తే నేనున్నానంటూ స్పందించే మనస్తత్వం సంధానిది. అందరితో స్నేహభావంగా ఉండేవారు. దశాబ్దాల క్రితం చండ్ర పుల్లారెడ్డి హయాంలో అజ్ఞాత దళాలు ఉమ్మడిగా పనిచేశాయి. నక్సల్స్‌ కార్యకలాపాలకు ఆకర్షితుడైన సంధాని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు జీపు డ్రైవర్‌గా కొంతకాలం పనిచేశారు. అనంతరం పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. అదే సమయంలో ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించడంతో 1984 పార్టీలో కార్యకర్తగా చేరారు. అప్పటినుంచి క్రియాశీలకంగా పనిచేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో వివిధ అజ్ఞాత నక్సల్స్‌ గ్రూపులకు చెందిన నాయకులు అధికార పార్టీలోవున్న వారిని టార్గెట్‌ చేసేవారు. అయినా బెదరకుండా సంధాని అందరితో సంబంధాలు సాగిస్తూ ముందుకెళ్లేవారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుని వద్ద గుర్తింపు ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో సత్సంబంధాలు ఉండేవి. ప్రస్తుతం గుండాల ఎంపీటీసీ, తెదేపా మహబూబాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన మృతిపై పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల వాసులు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు సంధాని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.  అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని