logo

ఏమార్చుతూ.. అడ్డదారులు తొక్కుతూ...

నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లు కన్నవారికి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని అమలుచేస్తోంది.

Published : 01 Dec 2022 04:20 IST

ఈటీవీ- ఖమ్మం, సత్తుపల్లి, న్యూస్‌టుడే 

* సత్తుపల్లికి చెందిన ఓ బాలికకు ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. కల్యాణలక్ష్మి పథకానికి అర్హత లేదని తెలుసుకున్న దళారులు రంగప్రవేశం చేశారు. బాలిక ‘ఆధార్‌’ మార్చేశారు. ఆ తర్వాత కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేశారు. ప్రభుత్వ సాయమందింది. ముందస్తు ఒప్పందం ప్రకారం దళారులు రూ.30వేలను తమ జేబుల్లో వేసుకున్నారు.


* భద్రాద్రి జిల్లా కేంద్రం సమీపంలోని మండలానికి చెందిన ఒకామె వివాహమైన తరువాత కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు దళారీని ఆశ్రయించారు. పకడ్బందీ ప్రణాళికతో దరఖాస్తు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు అనుమానమొచ్చింది. విద్యార్హత ధ్రువపత్రాలు అందించాలని కోరారు. చదువుకోలేదని బదులివ్వడటంతో వెనుదిరిగారు. మరోరోజు సిబ్బందిని పంపించి విచారణ జరపగా ఆమె చదువుకున్నట్లు మాత్రమే కాదు మైనర్‌గా తేల్చారు. దరఖాస్తును తిరస్కరించారు.

నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లు కన్నవారికి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని అమలుచేస్తోంది. పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.1,00,116 చొప్పున అందిస్తోంది. లబ్ధిదారుల కుటుంబాల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధికారుల సహకారంతో కొందరు వక్రమార్గంలో లబ్ధి పొందుతున్నారు. అడ్డదారుల్లో ఆధార్‌లో పుట్టిన తేదీలు మార్చి ప్రభుత్వ సాయమందేలా చూస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేల వరకు దళారులు దండుకుంటున్నారు.

లబ్ధి చేకూరాలిలా..

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేలాది నిరుపేద ఆడపిల్లల కుటుంబాలకు ప్రభుత్వ సాయమందింది. పెళ్లి చేసుకునే అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 దాటితేనే ఈ పథకానికి అర్హులు. ఇద్దరిలో ఏ ఒక్కరికి అంతకన్నా తక్కువ వయస్సున్నా పథకం వర్తించదు. పెళ్లికూతురు ఆధార్‌, పదోతరగతి మెమో, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోను దరఖాస్తుకు జతపరచాలి. వరుడి ఆధార్‌ కార్డు, పదోతరగతి మెమో, కుల ధ్రువపత్రం సమర్పించాలి. పెళ్లి కార్డు, వివాహ ధ్రువపత్రం, గెజిటెడ్‌ అధికారి సంతకం, పెద్దల వాంగ్మూలాలను దరఖాస్తుకు జతపరచాలి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ‘చెక్‌’ పెళ్లికూతురు తల్లి పేరిట మంజూరవుతుంది.

తూతూమంత్రంగా పరిశీలన

అర్హులకు అందాల్సిన ప్రభుత్వ పథకాన్ని కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల ఎదుట తిష్ఠవేసి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లబ్ధిదారుల కుటుంబీకులతో ముందే బేరం కుదుర్చుకుంటున్నారు. అనర్హులకైనా పథకం వర్తింపజేస్తామని నమ్మిస్తున్నారు. ఉభయ జిల్లాల్లో దళారుల ముఠాలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసే ప్రక్రియ నుంచి ప్రభుత్వ సొమ్ము అందేవరకు తామే చూసుకుంటామని అభయమిస్తున్నాయి. ఆధార్‌లో వయస్సు మార్చడంతోపాటు చదువుకోలేదని చెప్పి దరఖాస్తు చేసి ప్రభుత్వ సాయాన్ని అందిన కాడికి లాక్కుంటున్నారు. కొందరు తనిఖీ అధికారులు క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా దరఖాస్తులను పరిశీలించటం వల్లే అక్రమార్కుల పంట పండుతోందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.


అర్హులందరికీ సాయం

మధుసూదన్‌, అదనపు కలెక్టర్‌, ఖమ్మం

అర్హులందరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా ఆర్థిక సాయమందుతుంది. దీనికోసం దళారులను ఆశ్రయించొద్దు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి నిర్ధారించాకే చెక్కు మంజూరవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని