logo

Teenamar Mallana: కేసీఆర్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే చేస్తా: తీన్మార్‌ మల్లన్న

తీన్మార్‌ మల్లన్న చేపట్టిన ‘7200 ఉద్యమ పాదయాత్ర’కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ పాదయాత్రకు అనుమతులు నిరాకరించడంతో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మల్లన్న తెలిపారు.

Updated : 01 Dec 2022 08:45 IST

సమావేశంలో మాట్లాడుతున్న తీన్మార్‌ మల్లన్న

సత్తుపల్లి, న్యూస్‌టుడే: తీన్మార్‌ మల్లన్న చేపట్టిన ‘7200 ఉద్యమ పాదయాత్ర’కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ పాదయాత్రకు అనుమతులు నిరాకరించడంతో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మల్లన్న తెలిపారు. పాదయాత్రలో భాగంగా బుధవారం ఆయన సత్తుపల్లిలోని జేవీఆర్‌, కిష్టారం ఓసీల్లో పర్యటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండు మూడు రోజుల్లోనే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళతారన్న సమాచారం తమకు ఉందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఎక్కడ పోటీ చేసినా తాను అక్కడ పోటీ చేస్తామని ప్రకటించారు.

మల్లన్న బృందం రూపాంతరం చెంది రానున్న రోజుల్లో రాజకీయ పార్టీగా మారనుందన్నారు. నవంబర్‌ 26న భద్రాచలంలో ప్రారంభమైన పాదయాత్ర 100 కిలోమీటర్లు విజయవంతంగా కొనసాగిందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడే తమను ప్రజల్లో తిరగనీయకుండా పోలీస్‌ వ్యవస్థ ద్వారా అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. నేటి కేసీఆర్‌ రాజ్యంలో పాదయాత్రలు చేయాలంటే న్యాయస్థానాల అనుమతి పొందాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పాడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో తన ప్రసంగాలతో గొత్తికోయలంతా మావోయిస్టుల్లో చేరతారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారని, ఇంతకాలం తానిచ్చిన ప్రసంగాలతో ఎంత మంది మావోయిస్టుల్లో చేరారని ఆయన ప్రశ్నించారు. తమ న్యాయ బృందం ద్వారా హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని