logo

అన్నదాతలపై ఆంక్షల కత్తి..!

పెరిగిన ధరలు, విత్తనాలు, ఎరువుల నకిలీల బెడద, ప్రకృతి వైపరీత్యాలు, పంట ఉత్పత్తుల అమ్మకాలు, దళారుల దోపిడీ ఇలా.. దుక్కి దున్నటం నుంచి పంట దిగుబడుల సొమ్ము చేతికందే వరకు అన్నదాతల కష్టాలు అన్నీఇన్నీ కావు..

Updated : 02 Dec 2022 06:02 IST

- ఈటీవీ, ఖమ్మం

నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో ధాన్యం కొనుగోళ్లు

పెరిగిన ధరలు, విత్తనాలు, ఎరువుల నకిలీల బెడద, ప్రకృతి వైపరీత్యాలు, పంట ఉత్పత్తుల అమ్మకాలు, దళారుల దోపిడీ ఇలా.. దుక్కి దున్నటం నుంచి పంట దిగుబడుల సొమ్ము చేతికందే వరకు అన్నదాతల కష్టాలు అన్నీఇన్నీ కావు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ధాన్యం సేకరణలో పౌర సరఫరాల సంస్థ విధించిన కొత్త నిబంధనతో అన్నదాతల అవస్థలు మరింతయ్యాయి. ధాన్యం అమ్మిన రైతుకు చెల్లించే మొత్తం రూ.2 లక్షలు దాటితే సంబంధిత శాఖ అధికారి ధ్రువపత్రం జారీ చేయాలనే షరతుతో కర్షకులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురిస్తోంది. 

ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం గ్రేడ్‌-ఏ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధర చెల్లిస్తుంది. అంటే ఎకరంలో పంట పండించిన రైతుకు రూ.60వేలకు పైగా చేతికొస్తాయి. ఈ లెక్కన సుమారు మూడున్నర ఎకరాల్లో ధాన్యం దిగుబడికి రూ.2 లక్షలకు పైగా సొమ్ము అందుతుంది. ధాన్యం సొమ్ము రూ.2 లక్షలు దాటితే కొనుగోలు చేసిన శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి నుంచి ధ్రువపత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కొనుగోలు కేంద్రం బాధ్యులు తేవాల్సి ఉన్నా ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి అధికారితో ధ్రువపత్రం తీసుకుని అక్కడి నిర్వాహకులకు సమర్పించాల్సి ఉంటుంది. అసలే ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నెలరోజులు గడిచినా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము చేరడం లేదు.

* ఖమ్మం జిల్లాలో గడిచిన సీజన్‌లో 1,77,000 మంది రైతులు వరి సాగు చేశారు. వీరిలో పంట దిగుబడి సొమ్ము రూ.2 లక్షలు దాటేవారు సుమారు 30వేల మందికి పైగా ఉన్నారు.

పారదర్శకత కోసమే కొత్త నిబంధన అమల్లోకి వచ్చిందని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నా ధాన్యం సొమ్ము చేతికందటానికి ఎక్కువ సమయం పడుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ధాన్యం సేకరణ నెమ్మదిగా సాగుతోంది. పంట చేతికొచ్చిన వెంటనే ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దిగి ధాన్యం కొంటున్నారు. ప్రభుత్వం సైతం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా సేకరణ మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు 40 శాతం వరి కోతలు పూర్తయినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో 3.80 లక్షల మెట్రిక్‌ టన్నులు, భద్రాద్రి జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రూ.2 లక్షలు దాటితే..

అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఈవోలు సేకరించిన వివరాల ప్రకారం రైతుల నుంచి వచ్చే ధాన్యంపై ఓ అంచనా ఉన్నా బయటి వ్యక్తులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి వీల్లేకుండా, వ్యాపారుల వడ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుకు వచ్చే మొత్తం సొమ్ము రూ.2 లక్షలు దాటితే కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.


ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం
మధుసూదన్‌, అదనపు కలెక్టర్‌, ఖమ్మం

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిబంధనలు అమలవుతాయి. రూ.2 లక్షలు దాటి ధాన్యం సొమ్ము అందుకునే రైతుల తరఫున స్థానిక కొనుగోలు కేంద్రాల బాధ్యులే ధ్రువపత్రం అందిస్తారు. రైతులకు ఇబ్బందులుండవు. ధ్రువపత్రాల జారీలో జాప్యం చేయొద్దని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించాం. సకాలంలోనే రైతులకు ధాన్యం సొమ్ము చెల్లిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని