logo

ముక్కోటి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తర ద్వారం వద్ద కింది భాగంలో గతంలో ఉన్న గరుత్మంతుడి బొమ్మ స్థానంలో కొత్తదాన్ని తీర్చిదిద్దుతున్నారు.

Published : 02 Dec 2022 02:55 IST

ప్రత్యేక అధికారిగా ఏడీసీ జ్యోతి నియామకం?
భద్రాచలం, న్యూస్‌టుడే

ఎత్తు పెరగనున్న క్యూలైన్లు

భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తర ద్వారం వద్ద కింది భాగంలో గతంలో ఉన్న గరుత్మంతుడి బొమ్మ స్థానంలో కొత్తదాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతో పాటు ఆధ్యాత్మిక భావం కలిగిస్తోంది. ఇందులో పక్షి ఆకారంలో రెక్కలతో పాటు పాము స్పష్టంగా కనిపిస్తుంది. స్వాగత ద్వారాలను సుందరంగా తయారు చేసేందుకు శంఖు చక్రాల బొమ్మలను అలంకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్యూలైన్ల ఎత్తు నాలుగున్నర అడుగులు ఉండగా వీటిని ఐదున్నర అడుగులకు పెంచాలని నిర్ణయించారు. జులైలో వచ్చిన వరదలకు కొన్ని చోట్ల క్యూలైన్లు పాడవగా వీటిని తొలగించి కొత్త వాటిని నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. గురువారం ఆన్‌లైన్‌లో సెక్టార్‌ టిక్కెట్‌లను ఉంచడంతో తొలి రోజున సాయంత్రం వరకు 150 మంది వీటిని కొనుగోలు చేశారు. జిల్లాలోని ఐదు కౌంటర్లలో మొదటి రోజు నామమాత్రపు స్పందన ఉండటంతో ప్రచారాన్ని పెంచాలని భావిస్తున్నారు. మొత్తంగా 3,800 టికెట్లను విక్రయించనున్నారు.

ఆ అధికారి వచ్చేనా

అన్ని ఏర్పాట్లను ఈవో శివాజీ నేతృత్వంలో ఇద్దరు ఏఈవోలు, నలుగురు సూపరింటెండెంట్లు పర్యవేక్షించనున్నారు. 2023 జనవరి 1న తెప్పోత్సవం, 2న ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నారు. నూతన సంవత్సర వేడుకల నిమిత్తం పుణ్యక్షేత్రానికి విశేష సంఖ్యలో భక్తులు వచ్చే వీలుంది. ఈ పరిస్థితుల్లో భద్రాచలం రామాలయం గురించి తెలిసిన సీనియర్‌ను ఉత్సవ అధికారిగా నియమిస్తారని తెలిసింది. గతంలో ఇక్కడ ఈవోగా చేసి ప్రస్తుతం దేవాదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.జ్యోతి ఫెస్టివల్‌ అధికారిగా వస్తారని సమాచారం. దీనిపై ఇంకా ఉత్తర్వులు రాలేదని తెలిసింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర ప్రముఖులను ఆహ్వానించే వీలుంది. సాధారణంగా శ్రీరామ నవమికి గవర్నర్‌ను ఆహ్వానిస్తుంటారు. ఇప్పుడు ముక్కోటికి పిలుస్తారా లేదా అన్నది త్వరలో స్పష్టత రానుంది. ప్రముఖులు వస్తే ప్రొటోకాల్‌ విధులు కీలకం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని