logo

శిక్షణ భళా.. ఉపాధి కళకళ

నేటి పోటీ ప్రపంచంలో అరకొర నైపుణ్యాలతోనే విద్యార్థులు బయటకు వచ్చి కష్టపడుతున్నారు. డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఉపాధి అవకాశాల కోసం దిక్కులు చూస్తున్నారు. నైపుణ్య మెళకువలు లేక ఉద్యోగ వేటలో చతికిలపడుతున్నారు.

Published : 02 Dec 2022 02:55 IST

విద్యార్థులు, యువతకు మార్గనిర్దేశం
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే

ఖమ్మం ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు

నేటి పోటీ ప్రపంచంలో అరకొర నైపుణ్యాలతోనే విద్యార్థులు బయటకు వచ్చి కష్టపడుతున్నారు. డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఉపాధి అవకాశాల కోసం దిక్కులు చూస్తున్నారు. నైపుణ్య మెళకువలు లేక ఉద్యోగ వేటలో చతికిలపడుతున్నారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన వారు కూడా ఉద్యోగ పోటీ పరీక్ష ఎదుర్కొనే సత్తాలేక నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు, యువతకు ‘టాస్క్‌’ అండగా నిలుస్తోంది.

18 అంశాల్లో టాస్క్‌ తర్ఫీదు

కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను చేర్పించటం తప్ప వారికి ఉపాధి మార్గాలు చూపటం లేదు. అవకాశాలు కోల్పోతున్న యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) వారధిగా నిలుస్తోంది. గ్రామీణ విద్యార్థులు ఆంగ్లంపై పట్టు వచ్చేలా ఈ కోర్సులో ప్రతిభకు సానపెడుతున్నారు. ప్రత్యేక కార్యశాలలు నిర్వహించి శిక్షణ అందిస్తున్నారు. స్థానిక కళాశాలల్లో బోధకులతో పాటు ప్రత్యేకంగా టాస్క్‌ బృందం సభ్యులు బోధిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. సుమారు 18 రకాల అంశాల్లో తర్ఫీదు ఇచ్చి టాస్క్‌ ధ్రువపత్రాలు అందజేస్తున్నారు.

నమోదుకు 24 వరకు గడువు

2022-23 విద్యాసంవత్సరానికి విద్యార్థులు, కళాశాల నమోదు కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ నమోదుకు తుది గడువు. ఇంజినీరింగ్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఎంబీఏ, ఫార్మసీ అన్ని రంగాల్లో అభ్యసించే విద్యార్థులకు తక్కువ రుసుములతో శిక్షణ అందిస్తున్నారు.

పలు సంస్థల భాగస్వామ్యం

ప్రభుత్వం ‘టాస్క్‌’లో బహుళజాతి సంస్థలను భాగస్వాములను చేసింది. ఐటీతో పాటు ఇతర రంగాల పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుంది. నైపుణ్యాలున్న అభ్యర్థులను కోరుకుంటున్న పరిశ్రమలకు వేదికగా నిలుస్తోంది. చదువు పూర్తి చేసుకున్న వారికి భాగస్వామ్య సంస్థల్లో ప్రవేశాలుంటే సమాచారం అందిస్తారు. దీనిలో నమోదు చేసుకున్న విద్యార్థులకు దిగ్గజ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

ప్రస్తుతం పరిశ్రమల అవసరాలు ఎలా ఉన్నాయి, ఉద్యోగుల నుంచి యాజమాన్యాలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తున్నాయనే అంశాలను విద్యార్థులకు వివరిస్తున్నారు. పరిశ్రమలు నెలకొల్పటంలో మెళకువలు, అవసరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆలోచనలకు సాంకేతికత జోడించి అవకాశాలు ఎలా సృష్టించాలనే అంశాలను నేర్పిస్తున్నారు. వ్యక్తిగత సామర్థ్యాలు, బృందాన్ని నడిపించగల నైపుణ్యం, సాంకేతికత, విజ్ఞానం వంటి అంశాల్లో ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఐటీ హబ్లో ఏర్పాటుచేసిన టాస్క్‌ కార్యాలయంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని