logo

కొద్ది రోజుల్లో ‘వనమా అనర్హత కేసు’ తుది తీర్పు: జలగం

కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తాను కోర్టులో దాఖలు చేసిన కేసు తుది దశకు చేరిందని, కొద్ది రోజుల్లో తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెరాస నాయకుడు జలగం వెంకట్రావు అన్నారు.

Updated : 02 Dec 2022 06:57 IST

మాట్లాడుతున్న కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తాను కోర్టులో దాఖలు చేసిన కేసు తుది దశకు చేరిందని, కొద్ది రోజుల్లో తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెరాస నాయకుడు జలగం వెంకట్రావు అన్నారు. తీర్పు ఎలావున్నా స్వీకరించక తప్పదని, ప్రస్తుతం మాజీ అయిన తానే సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కావొచ్చేమో అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం వెళ్తూ గురువారం ఖమ్మంలో తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తన ప్రణాళిక తనకుందన్నారు. ఎన్నికలు వచ్చాక పోటీ చేయక తప్పదని, కొత్తగూడెంలోనే కాదు తాను పుట్టిన ఖమ్మంలోనూ తనకు సమాన హక్కుందన్నారు. టిక్కెట్‌ ఎవరు ఆశించినా తప్పులేదని, అధిష్ఠానం ఒకరికే టిక్కెట్‌ ఇస్తుందన్నారు. పొత్తుల్లో తెరాస ఓట్లు కమ్యూనిస్టులకు బదలాయింపు ఉమ్మడి జిల్లాలో సులభం కాదన్నారు. కాంగ్రెస్‌, భాజపాలు జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేవన్నారు. తెరాసలోనే నేతల మధ్య పోటీ అధికంగా ఉందికదా అన్న ప్రశ్నకు ఎన్నికల సమయానికి అన్నీ సర్దుబాటు అవుతాయన్నారు. నియోజకవర్గంలో ఉండరనే విమర్శలకు సమాధానమిస్తూ స్థానికంగా ఉంటేనే ప్రజలకు దగ్గరగా ఉన్నట్లు కాదని, తాను ఇక్కడే ఉండి ప్రజా సమస్యల విషయంలో జోక్యం చేసుకోవటం వల్ల వారికి నష్టం జరుగుతుందన్నారు. తన హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు మధ్యలో ఆపేశారని, శాంతిభద్రతలు గాడితప్పిన కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజలు తన అవసరాన్ని గుర్తిస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని