logo

దేహదారుఢ్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: సీపీ

కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగార్థులకు గురువారం నుంచి జరిగే దేహదారుఢ్య పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ తెలిపారు.

Published : 07 Dec 2022 04:40 IST

ఖమ్మంలో షాట్‌పుట్‌ ఈవెంట్‌ను పరిశీలిస్తున్న సీపీ, పోలీసు అధికారులు

ఖమ్మం నేరవిభాగం: కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగార్థులకు గురువారం నుంచి జరిగే దేహదారుఢ్య పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ తెలిపారు. ఖమ్మం పరేడ్‌ మైదానంలో కానిస్టేబుళ్లతో ట్రయల్‌ రన్‌ను మంగళవారం నిర్వహించారు. పరీక్షలకు ఉభయ జిల్లాల నుంచి 24,733 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ సమీపంలోని శివాలయం వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బంది అడ్మిట్‌ కార్డు ఉన్న అభ్యర్థులకు టోకెన్‌ నంబరు ఇచ్చి పోలీసు కల్యాణ మండపంలోకి అనుమతిస్తారని వెల్లడించారు. 50 మంది అభ్యర్థులను ఇద్దరు రన్నర్స్‌(కానిస్టేబుళ్లు) మైదానంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్దకు తీసుకెళ్తారన్నారు. డాక్యుమెంట్‌ పరిశీలన, బయోమెట్రిక్‌ తర్వాత ప్రతి అభ్యర్థి చేతికి చిప్‌తో కూడిన రిస్ట్‌బ్యాండ్‌, డిజిటల్‌ చిప్‌తో కూడిన ఆర్‌ఎఫ్‌ఐడీ బ్యాండ్స్‌ అటాచ్‌ చేస్తారన్నారు. అనంతరం పురుష అభ్యర్థులకు 1,600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగు నిర్వహిస్తారని తెలిపారు.  నిర్ణీత సమయంలో పరుగు పూర్తి చేసిన వారి ఎత్తు కొలుస్తారని చెప్పారు. ఎత్తులో నెగ్గిన వారిని లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీలకు అనుమతిస్తారన్నారు. కీలకమైన ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ ప్రతి ఈవెంట్‌లో అర్హత సాధించాలని తెలిపారు. ఈవెంట్‌లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయని, ఏసీపీ స్థాయి అధికారిని ఈవెంట్‌ వద్ద నియమించినట్లు వివరించారు. మొదటి రోజు 600 మంది, రెండోరోజు 800 మంది, క్రమేణా 1,300 మంది వరకు దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతారన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఏఎస్పీ ఆక్షాంశ్‌ యాదవ్‌, ఏడీసీపీలు సుభాష్‌చంద్రబోస్‌, కుమారస్వామి, ఏసీపీ ప్రసన్నకుమార్‌, రవి, ఆర్‌ఐలు రవి, శ్రీనివాస్‌, సాంబశివరావు, తిరుపతి, శ్రీశైలం, సీఐలు చిట్టిబాబు, అశోక్‌కుమార్‌, సత్యనారాయణరెడ్డి, యూనిట్‌ డాక్టర్‌ జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

హోంగార్డుల సేవలు ఆదర్శం..: హోంగార్డు ఆఫీసర్ల సేవలు ఆదర్శనీయమని సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు. హోంగార్డుల దినోత్సవాన్ని పోలీసు శిక్షణ కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. హోంగార్డు ఆఫీసర్ల నుంచి సీపీ గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్‌ కమాండర్‌గా వెంకటేశ్వర్లు వ్యవహరించారు. సీపీ మాట్లాడుతూ పోలీసు శాఖ విధులకు సహకారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన హోంగార్డు ఆర్గనైజేషన్‌ ప్రస్తుత సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ సమయంలోనూ ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా హోంగార్డులు కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. క్రీడల్లో గెలుపొందిన హోంగార్డు ఆఫీసర్లకు బహుమతులు అందజేశారు. ఏసీఏసీపీ బస్వారెడ్డి, సీఐ సర్వయ్య, రామకృష్ణ, ఆర్‌ఐలు శ్రీశైలం, రవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని