logo

వ్యాధుల గూడు..గిరిజనుల గోడు

అభం, శుభం తెలియని మూడేళ్ల బాలుడు.. అల్లరి చేష్టలతో ఇళ్లంతా సందడి చేయాల్సిన వయస్సులో మంచాన పడ్డాడు. బక్కచిక్కిన శరీరంతో నీరసించిపోయాడు

Updated : 07 Dec 2022 05:23 IST

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే

*అభం, శుభం తెలియని మూడేళ్ల బాలుడు.. అల్లరి చేష్టలతో ఇళ్లంతా సందడి చేయాల్సిన వయస్సులో మంచాన పడ్డాడు. బక్కచిక్కిన శరీరంతో నీరసించిపోయాడు. కొడుకు ఆటపాటలకు మురిసిపోవాల్సిన ఆ గిరిజన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం ఆవిరైంది. వైద్య పరీక్షల్లో తలసీమియా ఉందని తేలడంతో వారి గుండెల్లో పిడుగు పడింది. బాలుడికి ఐదేళ్లు వచ్చే వరకు 80 సార్లకు పైగా రక్తం ఎక్కించారు. ఆర్థిక సమస్యలతో కాలేయాన్ని మార్పించలేదు. కొద్దినెలల క్రితం బాలుడు తనువు చాలించాడు. ఈ ఘటన జూలూరుపాడు మండలంలోని ఓ తండాలో చోటుచేసుకుంది.
* మణుగూరు మండలానికి చెందిన యువ జంట సంతానం కోసం తపిస్తోంది. నెల తప్పడం, అబార్షన్‌ అవడం, మృత శిశువు జన్మించటం.. ఇలా జరిగిన ప్రతిసారీ దంపతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగి పరీక్షలు చేయించుకుంటే ఇద్దరికీ సికిల్‌సెల్‌ ఉందని తేలింది.

గిరిజన ప్రాంతాల్లో తలసీమియా, సికిల్‌సెల్‌తో అనేకమంది నలిగిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల్లో ఈ తరహా వ్యాధులపై వైద్య, ఆరోగ్య శాఖ ఇటీవల దృష్టి సారించింది. ఎనిమిది జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉండటం గమనార్హం. తలసీమియా, సికిల్‌సెల్‌ బాధితులు క్రమేణా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అధికమవుతున్నారు. ఈఏడాది నిర్వహించిన శిబిరాల్లో పలువురు సికిల్‌సెల్‌, తలసీమియాతో బాధపడుతున్నట్లు అధికారులు తేల్చారు. చర్లలో ఐదేళ్ల నుంచి 17 ఏళ్లలోపువారు 18 మంది, 25 ఏళ్ల యువకుడు, జూలూరుపాడు మండలం బేతాళపాడులో ఆరేళ్ల నుంచి 12 ఏళ్ల పిల్లల్లో ఏడుగురు తలసీమియా, ఓ బాలుడు సికిల్‌సెల్‌ బారిన పడినట్లు గుర్తించారు. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లిలో పదేళ్ల నుంచి 40 ఏళ్లలోపు తొమ్మిది మంది సికిల్‌సెల్‌, ఒకరు తలసీమియాతో బాధపడుతున్నట్లు తేల్చారు. బూర్గంపాడు మండలం నాగారంలో 25 ఏళ్ల మహిళ సికిల్‌సెల్‌ బారిన పడినట్లు గుర్తించారు. తలసీమియా, సికిల్‌సెల్‌ వ్యాధులు మేనరికం, జన్యుపరంగా సంక్రమించే ఆస్కారముందని వైద్యులు చెబుతున్నారు. పంజాబ్‌ ట్రైబ్స్‌లో ఎక్కవగా కన్పించే ఈ తరహా వ్యాధులు ఇక్కడి ఏజెన్సీ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయంటున్నారు.

స్వచ్ఛంద సంస్థల చేయూత

ఖమ్మం జిల్లాలో తలసీమియాతో 188 మంది, సికిల్‌సెల్‌ ఎనిమియాతో 60 మంది బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరితో పాటు రెండు వేర్వేరు సొసైటీల్లో 445 మంది బాధితుల పేర్లు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదివాసీల్లోనూ బాధితులున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరికి అత్యవసర సమయంలో స్వచ్ఛంద సంస్థలు రక్తాన్ని అందించేందుకు యత్నిస్తున్నాయి.
* భద్రాద్రి జిల్లాలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలతో పాటు రక్త సేకరణ ప్రక్రియ జరుగుతోంది.

జీవితాంతం రక్తం ఎక్కించుకోవాల్సిందే..
డాక్టర్‌ వీరబాబు, పిల్లల వైద్య నిపుణుడు

తలసీమియా, సికిల్‌సెల్‌ బాధితులు జీవితాంతం రక్తం ఎక్కించుకోవాలి. ఈ వ్యాధులను పూర్తిస్థాయిలో నివారించలేం. చాలాసార్లు రక్తం ఎక్కించడం వల్ల పిల్లలు తట్టుకోకపోవచ్చు. కొందరు చనిపోతారు. తలసీమియా, సికిల్‌సెల్‌ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తం ఎక్కించేందుకు చర్యలు చేపడుతున్నాం.

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని