logo

ఇంచుమించు..మంచు ముంచు

వేంసూరు మండలం పల్లెవాడకు చెందిన మల్లెల నాగేంద్ర(55) చిరుధాన్యం వ్యాపారం చేస్తుంటారు.

Updated : 07 Dec 2022 05:21 IST

 ప్రయాణ సమయంలో అప్రమత్తతే కీలకం

విజయవాడ- భద్రాచలం జాతీయ రహదారిపై కురుస్తున్న మంచు

* వేంసూరు మండలం పల్లెవాడకు చెందిన మల్లెల నాగేంద్ర(55) చిరుధాన్యం వ్యాపారం చేస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేపట్టిన ఆయన.. ఇంటి సామగ్రి నిమిత్తం ద్విచక్రవాహనంపై డిసెంబర్‌ 5న సత్తుపల్లికి వెళ్తుండగా కిష్టారం ఓసీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు.
* మధిర మున్సిపాల్టీలో మధిర- రాయపట్నం వంతెన వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డు ప్రాంతం ప్రమాదకరంగా మారింది. శీతాకాలంలో యార్డులో పోగవుతున్న టన్నుల వ్యర్థాలను కాల్చేసే క్రమంలో దట్టమైన పొగ రోడ్డుపైకి చేరుతుంది. యార్డులో వ్యర్థాలను తినేందుకు పందులు, కుక్కలు, ఇతర పశువులు వస్తున్నాయి. ఓవైపు పొగ, మరోవైపు మంచు, ఇంకోవైపు జంతువులు రోడ్డుపైకి రావడంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

చలికాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా సంభవిస్తుంటాయి. పొగ మంచే ఇందుకు ప్రధాన కారణమని గతేడాది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయ్యప్ప స్వాములు, భవానీ దీక్షధారులు రోడ్డుపై కాలినడకన వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

హెచ్చరిక బోర్డులను గమనించాలి
టి.సత్యనారాయణ, డీఎస్పీ, పాల్వంచ

అవగాహన లేమి, మితిమీరిన వేగంతో వాహనదారులు ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చలికాలంలో రహదారి పక్కన ఏర్పాటు చేసిన బోర్డులననుసరించి ప్రయాణించాలి. ఇతర వాహనాలను దాటలన్నా ఆతృత డ్రైవర్లకు ఉండొద్దు.

ఇవి పాటించాలి..

* ఉదయం పూట మంచు తగ్గిన తరువాత ప్రయాణించడం మంచిది.
* తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే ఉదయం వాహనం నడపే సమయంలో కచ్చితంగా లైట్లు వేసుకోవాలి.
* వాహనం నేర్చుకుంటున్నా, డ్రైవింగ్‌ రాకున్నా ఉదయం పూట వాహనాలు నడపడం మంచిది కాదు.
* వాహనం కండిషన్‌లో ఉండాలి. ఇంజిన్‌, టైర్లు, ముందు అద్దాలు సరిగ్గా ఉంటేనే వాహనం బయటకు తీయాలి.
* రోడ్డుపై ఆర్‌అండ్‌బీ, ఆర్డీవో, పోలీసు శాఖ సూచించిన నిబంధనలు పాటించాలి.
* తెల్లవారుజామున సహజంగా డ్రైవర్లు నిద్రమత్తుగా ఉంటారు. నిద్రవస్తే సరైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని వాహనాన్ని పక్కనబెట్టి కాసేపు కునుకు తీయాలి.

 

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని