Khammam: స్థానికంగానే సాఫ్ట్‌వేర్ కొలువులు
వేగంగా విస్తరిస్తున్న ఖమ్మం నగరంలో పలు ఐటీ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.
ఖమ్మంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే
ఖమ్మం ఐటీ హబ్
వేగంగా విస్తరిస్తున్న ఖమ్మం నగరంలో పలు ఐటీ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అమెరికా సహా పలు దేశాలకు చెందిన మరికొన్ని కంపెనీల చూపు ఇప్పుడు నగరంపై పడింది. ఇప్పటికే ఐటీ హబ్‌లో 19 కంపెనీలు 455 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీటితో పాటు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గతంలోనే ఐటీ ఫేజ్-2కు శంకుస్థాపన చేశారు. దీనిలో మరో 30 కంపెనీల వరకు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వివిధ దేశాల్లో స్థిరపడ్డ వ్యాపారులు వారి కార్యకలాపాలు నగరానికి విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఎన్‌ఆర్‌ఐ ఒకరు తెలిపారు. పలు చిన్న కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాయి. దీని వల్ల జిల్లా యువత దూర ప్రాంతాల్లోని పట్టణాలకు వెళ్లే బదులు స్థానికంగానే ఉపాధి పొందే అవకాశాలు మెరుగుపడుతున్నాయి.
భవిష్యత్తులో మరింత విస్తరణ
స్థానికంగా ఐటీ కంపెనీల్లో బీపీవో/ఐటీ రిక్రూట్‌మెంట్‌తో పాటు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌గా కూడా ఆధునిక సాంకేతికతలైన బ్లాక్ చైన్, సేల్స్‌ఫోర్స్, జావా, అక్కౌంటింగ్ సాఫ్ట్‌వేర్ లాంటి సాంకేతికతపైన ప్రాజెక్టులు చేస్తుండటంతో యువత స్థానికంగా పనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. భవిష్యత్తులో కొత్త టెక్నాలజీలపైన పనిచేసేందుకు సిద్ధపడుతున్నారు.
యువతకు మంచి అవకాశాలు
స్థానికంగా ఐటీ కంపెనీలు విస్తరిస్తుండటంతో యువతకు మంచి ఉపాధి అవకాశాలు స్థానికంగానే దొరుకుతున్నాయి. ఇంజినీరింగ్, ఎంబీఏ, డిగ్రీ పూర్తికాగానే ఫ్రెషర్‌గా వేతనం తక్కువగా ఉన్నప్పటికీ అనుభవం వచ్చే వరకు ఒక ఏడాది లేదా రెండు సంవత్సరాలు స్థానికంగా ఉద్యోగం చేసుకుని అనుభవం వచ్చాక బహుళజాతి కంపెనీల్లో పెద్ద జీతం పొందటానికి అవకాశం వస్తుంది. యువతులకు ఇది ఇంకా మంచి అవకాశమనే చెప్పుకోవాలి. డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగం కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు పంపకుండా స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు వస్తుండటంతో తల్లిదండ్రులు సంతోషంలో ఉండగా అమ్మానాన్నలతోనే ఉంటూ ఉద్యోగం చేసుకునే అవకాశం రావటం పిల్లలు అదృష్టంగా భావిస్తున్నారు.
మరో కంపెనీ ‘టెక్ వేవ్’
నగరంలోని అల్లీపురం రోడ్డులో ఈ అమెరికా కంపెనీ ఉంది. జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు గుమ్మడపు దామోదర్‌రావు, గుమ్మడపు రాజశేఖర్‌లు ఏడాదిన్నర క్రితం నగరంలో ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఏపీలోని పలు జిల్లాలకు చెందిన యువతీ యువకులు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. బీటెక్‌లో సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ బ్రాంచిల విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2025 నాటికి 8వేల మందికి ఉపాధి కల్పించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. పలు దేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈకంపెనీకి చెందిన శాఖలను ఏర్పాటు చేశారు.
గతంలో హాస్టల్‌లో ఉన్నప్పుడు, హైదరాబాద్‌లో పనిచేసినప్పుడు అక్కడి వాతావరణం పడక తరచు అనారోగ్యానికి గురయ్యా. ఇప్పుడు సొంత ఊళ్లో ఉద్యోగం చేయటం ఎంతో సంతోషంగా ఉంది. రూ.4.9లక్షల వార్షిక వేతనంతో పనిచేస్తున్నా. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగానే ఉద్యోగం చేయటం సంతృప్తినిస్తోంది.
జి.సత్యనారాయణ, బీటెక్(ఈసీఈ), ఖమ్మం, క్లస్టర్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ
హైదరాబాద్‌లో పనిచేసినప్పుడు కార్యాలయానికి వెళ్లాలన్నా, ఇంటికి రావాలన్నా ప్రయాణానికే రెండు గంటల సమయం పట్టేది. ఇక్కడ పది నిమిషాల ముందు బయలుదేరితే కార్యాలయానికి చేరుకుంటాం. ఏవైనా మరచిపోయిన సర్టిఫికెట్లు తిరిగి కార్యాలయానికి తెచ్చు కోవాలంటే అక్కడ ఆరోజు ఇక సెలవు పెట్టాల్సిందే. ఏడాదికి రూ.3.8లక్షల వార్షిక వేతనంతో పనిచేస్తున్నా.
టి.అభినయ్‌రెడ్డి, బీటెక్(ఈసీఈ), ఖమ్మం, సావరిన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ
ఖమ్మం నగరం ఐటీ రంగంలో దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రధాన నగరాల్లో పనిచేసినంత అనుభూతి ఉంది. ఇక్కడ కూడా ప్రతిభ కలిగిన అనేక మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మంచి వేతనంతో పనిచేస్తున్నారు. నేను రూ.7.2లక్షల వార్షిక వేతనంలో పనిచేస్తున్నా. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు నగరం వైపు చూస్తున్నాయి. సొంత పట్టణంలోనే మంచి వేతనంతో పనిచేస్తున్నా. ఆనందంగా ఉంది.
ఏ.సురేశ్, బీటెక్(ఈసీఈ), ఖమ్మం, క్లస్టర్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ
స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు లభించటం మహిళలకు ఎంతో ఉపయోగం. దూరప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయాలంటే తమ భద్రతపై తల్లిదండ్రులకు కొంత ఆందోళన ఉండేది. ఇప్పుడు వారి కళ్ల ఎనే కొలువు చేయటం వల్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి బాగోగులను సైతం చూసుకుంటున్నాం. రూ.4.9లక్షల వార్షిక వేతనంతో పనిచేస్తున్నా.
ఏ.శ్రీచరిత, బీటెక్(ఈసీఈ), ఖమ్మం, క్లస్టర్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఊరేగింపులో పడిపోయిన వినాయకుడి విగ్రహం.. సాయం చేసిన ముస్లిం యువత.. వీడియో!
-
JK: ₹300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ఇద్దరి అరెస్టు
-
Narnia: గుజరాత్ సముద్ర తీరానా హుందాగా మృగరాజు.. అరుదైన ఫొటో వైరల్..!
-
Chahal: బాధ ఎందుకు ఉండదు.. కానీ 15 మందికే కదా అవకాశం: చాహల్
-
PM Modi: తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ: ప్రధాని మోదీ
-
Jaguar Land Rover: 2030 కల్లా 8 విద్యుత్ వాహనాలను తీసుకొస్తాం: జాగ్వార్ ల్యాండ్‌రోవర్