logo

వివాహిత, తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి

వివాహిత, ఆమె తల్లిదండ్రులపై అత్తింటి వారు గొడ్డలి, కత్తులతో దాడికి పాల్పడ్డ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఈ క్రమంలో వివాహిత కుటుంబ సభ్యులు చేసిన ప్రతిదాడిలో ఒకరు గాయాలపాలయ్యారు.

Published : 21 Jan 2023 01:05 IST

కంటిపై గాయాలతో ఓర్సు శైలజ

ఆళ్లపల్లి, న్యూస్‌టుడే: వివాహిత, ఆమె తల్లిదండ్రులపై అత్తింటి వారు గొడ్డలి, కత్తులతో దాడికి పాల్పడ్డ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఈ క్రమంలో వివాహిత కుటుంబ సభ్యులు చేసిన ప్రతిదాడిలో ఒకరు గాయాలపాలయ్యారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన దుంప రాములు, పూలమ్మ దంపతుల కుమార్తె శైలజను అదే గ్రామానికి చెందిన ఓర్సు రాంబాబుకిచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. రెండేళ్లపాటు వారి కాపురం సజావుగా సాగింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం పేరుతో శైలజను మానసికంగా, శారీరకంగా హింసించి పుట్టింటికి పంపించారు. గ్రామ పెద్దలు, పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి తిరిగి ఆమెను అత్తవారింటికి పంపారు. అదే క్రమంలో రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. భార్యను తరచూ తిడుతూ, కొడుతూ పుట్టింటికి వెళ్లిపోమని వేధిస్తుండేవాడు. వేధింపులు భరించలేక వారం క్రితం శైలజ పుట్టింటికి తిరిగి వచ్చింది. భర్త వివాహేతర సంబంధ విషయమై ప్రశ్నించేందుకు శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో శైలజ, తన తల్లిదండ్రులతో కలిసి అత్తంటికి వెళ్లింది. ఈ క్రమంలో గొడ్డలి, కత్తులతో రాంబాబు, అతని సోదరుడు ఓర్సు మల్లయ్య, వదిన రాధ, తల్లిదండ్రులు వెంకన్న, సారమ్మలు దాడికి పాల్పడటంతో శైలజ, ఆమె తల్లిదండ్రులు గాయపడ్డారు. ప్రతిదాడిలో రాంబాబు తండ్రి వెంకన్నకు తల, నడుముపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ప్రైవేటు వాహనంలో ఆళ్లపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మైరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఓర్సు రాంబాబు, తల్లిదండ్రులు, అన్నవదినలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఆళ్లపల్లి ఎస్సై రతీశ్‌ తెలిపారు.

ప్రతిదాడిలో గాయపడ్డ ఓర్సు వెంకన్న

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు