logo

పుష్కర పట్టాభిషేకానికి పటిష్ఠ ఏర్పాట్లు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చిలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. 12 ఏళ్లకోసారి వచ్చే సంబరం కావడంతో ఆస్థాయిలో భక్తులు వస్తారన్న అంచనాతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది.

Published : 22 Jan 2023 02:43 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చిలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. 12 ఏళ్లకోసారి వచ్చే సంబరం కావడంతో ఆస్థాయిలో భక్తులు వస్తారన్న అంచనాతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. దివిస్‌ ల్యాబరేటరీస్‌ లిమిటెడ్‌ సహకారంతో ఆరుచోట్ల ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి పూనుకుంది. ప్రధాన టిక్కెట్‌ కౌంటర్‌, తూర్పు మెట్లు, శ్రీరామ నిలయం, అన్నదానం, సౌమిత్రి సదనం, పర్ణశాలలో శ్రీరామనవమికి ముందే ఈప్లాంట్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రతి ప్లాంట్‌ గంటకు 1,000 లీటర్ల సురక్షిత నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఉన్నవి మరమ్మతులకు గురికాగా ఇంకొన్ని అలంకారప్రాయంగా మారాయి. కొత్తవి ఉపయోగంలోకి వస్తే భక్తులకు తాగునీటి కష్టాలు తీరినట్లే. రామాలయానికి చెందిన రూ.10 లక్షలతో ఆయా ప్లాంట్ల వద్ద ప్లాట్‌ఫాంలు నిర్మిస్తున్నారు.


పనుల్లో వేగం పెంచాలని..

దాతలు గతంలో నిర్మించి అప్పగించిన శ్రీరామనిలయం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈ పరిస్థితుల్లో దీన్ని గుత్తేదారుకు అధికారులు కట్టబెట్టారు. ఏడాదికి రూ.11.44 లక్షలను ఆలయానికి అద్దె రూపంలో చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 31 ఏసీ, 33 ఏసీ కం నాన్‌ ఏసీ గదులున్నాయి. ఇక్కడ పనిచేసే పొరుగు సేవల సిబ్బందిని దేవస్థానం పరిధిలో అధికారులు సర్దుబాటు చేయనున్నారు. ఈప్రక్రియ విజయవంతమైతే ఇంకొన్ని సత్రాలను ప్రైవేట్‌ పరం చేయాలని యోచిస్తున్నారు. సౌమిత్రి సదనం వద్ద రూ.3 కోట్ల విలువైన సత్రాల పనులను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన తితిదే సత్రాల సముదాయాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. రంగనాయకుల గుట్టపై నిర్మించిన వాటిని ప్రారంభించనున్నారు. తుది దశలో ఆగిన వాటికి మెరుగులు దిద్దనున్నారు. రూ.2 కోట్లు వెచ్చించి ఓ సంస్థ సౌర విద్యుత్తు సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. మార్చి నాటికి దీనిద్వారా విద్యుత్తు సరఫరా చేయాలని ఆలయాధికారులు నిర్ణయించారు.


రూపుదిద్దుకుంటున్న బంగారు సింహాసనం

శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాల తేదీలను వెల్లడించనప్పటికీ మార్చి 30న శ్రీరామనవమికి కల్యాణోత్సవం జరిపి 31న సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించే వీలుంది. ప్రస్తుతం ఒక వెండి సింహాసనం ఉంది. మిగతా వాటిల్లో ఇత్తడివే ఎక్కువ. దాతల సాయంతో రూ.కోటి వెచ్చించి పదకొండు వెండి వాహనాలతో పాటు బంగారు సింహాసనాన్ని తయారుచేస్తున్నారు. వీటి పనులను పరిశీలించేందుకు ఈవో శివాజీ నేతృత్వంలో వైదిక సిబ్బంది తమిళనాడులోని కుంభకోణంలో శనివారం పర్యటించారు. అక్కడ నిపుణులు వీటిని ఆగమశాస్త్రం ప్రకారం సిద్ధం చేసి పండగకు ముందే అందించనున్నారు. వేడుకల తరుణంలో కొందరు ఉద్యోగ విరమణ చేయనున్నందున సిబ్బంది కొరత తలెత్తకుండా ఆలయాధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఉత్సవ ఏర్పాట్లకు రూ.2 కోట్లకు పైగా బడ్జెట్‌ అవసరమని అంచనా వేస్తున్నారు. 200 క్వింటాళ్ల బియ్యం, 200 కిలోల ముత్యాలతో ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేయనున్నారు.

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని