logo

రోగులు వస్తున్నారు.. సదుపాయాలు కల్పించండి

నరాల సంబంధ సమస్యతో రెండు కాళ్లు పడిపోయిన ఓ రోగి కదల్లేని స్థితిలో జిల్లా ఆస్పత్రిలోని న్యూరో విభాగం వైద్యుల్ని సంప్రదించారు. అతనికి హైదరాబాద్‌ స్థాయిలో చికిత్సకు అవకాశం ఉన్న జీబీ సిండ్రోమ్‌ సమస్యకు ఇక్కడే వైద్యాన్ని అందించారు.

Updated : 23 Jan 2023 05:32 IST

జిల్లా ఆస్పత్రి న్యూరో విభాగంలో వనరుల కొరత
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులు

నరాల సంబంధ సమస్యతో రెండు కాళ్లు పడిపోయిన ఓ రోగి కదల్లేని స్థితిలో జిల్లా ఆస్పత్రిలోని న్యూరో విభాగం వైద్యుల్ని సంప్రదించారు. అతనికి హైదరాబాద్‌ స్థాయిలో చికిత్సకు అవకాశం ఉన్న జీబీ సిండ్రోమ్‌ సమస్యకు ఇక్కడే వైద్యాన్ని అందించారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా 24 ఇంజక్షన్లు ఇవ్వడంతో వారం రోజుల్లోనే రోగి సాధారణ స్థితికి చేరుకున్నారు. ఇలాంటి ఖరీదైన వైద్యాన్ని ఖమ్మం సర్కారు దవాఖానాలో అందించారు.

మహబూబాబాద్‌ జిల్లా ఉప్పెరగూడేనికి చెందిన శ్రీకాంత్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. తల నుదుటి ఎముకలు విరిగి మెదడులోకి చొచ్చుకెళ్లడంతో అచేతన స్థితికి చేరారు. ఖమ్మం ప్రభుత్వ వైద్యులు అతనికి డీకంప్రెసివ్‌ కానియెక్టమీ ఎవాక్యువేషన్‌ చికిత్స అందించారు. విరిగిపోయిన ఎముకల స్థానంలో కృత్రిమ ఎముకలు అమర్చారు. శస్త్ర చికిత్స జరిగిన తొమ్మిది రోజుల్లోనే రోగి పూర్తిగా కోలుకొని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.

ఖమ్మం జిల్లా ఆస్పత్రిలోని న్యూరో(నరాల) విభాగానికి రోగులు పోటెత్తుతున్నారు. 2021, జూన్‌లో ప్రారంభమైన ఈ విభాగంలో పలు రకాల నరాల సమస్యలు, ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన వందల మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అనేక అత్యవసర కేసులకు వైద్యులు పరిష్కారం చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని కేసులను హైదరాబాదుకు రిఫర్‌ చేస్తున్నారు. ఖరీదైన న్యూరో ప్రత్యేక సేవలను ప్రవేశపెట్టినా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమకూరిస్తే అన్ని రకాల కేసులకు ఇక్కడ వైద్యం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం 10 పడకలతో ఐసీయూ అందుబాటులో ఉంది. దీన్ని మరింత విస్తరించాల్సి ఉంది.

ఎలాంటి కేసులు

న్యూరో విభాగాన్ని బ్రెయిన్‌ క్యాన్సర్‌, వెన్నుపూస సమస్య, పక్షవాతం, మెదడులో రక్తం గడ్డకట్టడం, ట్యూమర్‌, సర్వైకల్‌ వంటి అనేక రకాల జబ్బులతో బాధపడుతున్న వారు సంప్రదిస్తున్నారు. ప్రతి నెలా దాదాపు 30-40 క్లిష్టతర కేసులు నమోదవుతున్నాయి. కానీ ఓపీ, ఐపీ విభాగాల్లో వైద్యుల సంఖ్య తగిన స్థాయిలో లేదు. ప్రస్తుతం ఒప్పంద పద్ధతిలో ఒక్కొక్కరే శస్త్ర చికిత్స నిపుణులు, మత్తు వైద్య నిపుణులు పనిచేస్తున్నారు. అవకాశం ఉన్న మేరకు వైద్యం అందిస్తున్నా అనేక కేసులను రాజధానికి తరలించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా శస్త్ర చికిత్స విభాగాన్ని తక్షణం అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. ముఖ్య పరికరాలు లేకపోవడంతో సంబంధిత చికిత్సలు చేయడం సాధ్యం కావటం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని