logo

దృష్టి సారిస్తే మరింత ఖ్యాతి

భక్తరామదాసు స్వస్థలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఏటా జయంత్యుత్సవాలను స్థానికులు భక్తిశ్రద్ధలతో చేస్తున్నా ప్రభుత్వం నామమాత్ర ఏర్పాట్లు చేస్తున్నారన్న విమర్శ నెలకొంది.

Published : 25 Jan 2023 03:45 IST

నేటి నుంచి భక్తరామదాసు జయంత్యు త్సవాలు

భక్తరామదాసు కాంస్య విగ్రహం

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: భక్తరామదాసు స్వస్థలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఏటా జయంత్యుత్సవాలను స్థానికులు భక్తిశ్రద్ధలతో చేస్తున్నా ప్రభుత్వం నామమాత్ర ఏర్పాట్లు చేస్తున్నారన్న విమర్శ నెలకొంది. నేటి నుంచి మూడు రోజులపాటు భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా పాలనా యంత్రాంగం, భద్రాచలం రామాలయ దేవస్థానం, విద్వత్‌ కళాపీఠం ఆధ్వర్యంలో భక్తరామదాసు జయంత్యుత్సవాలను నిర్వహించనున్నారు. ఇక్కడి కంచర్లగోపన్న నివాసాన్ని 1955లో అప్పటి సర్పంచి పెండ్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ధ్యాన మందిరంగా అభివృద్ధి చేశారు. తరువాత 2000 ఆధునికీకరించిన ధ్యాన మందిరాన్ని ప్రముఖ గాయకులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రారంభించారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2018 జనవరిలో ధ్యాన మందిరంలో భక్తరామదాసు కాంస్యవిగ్రహం, ఆంఫీ థియేటర్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విగ్రహం అప్పుడే ఏర్పాటు చేసినా, థియేటర్‌ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. గతంలో ఓ ఏడాది మాత్రం మాజీ మంత్రి తుమ్మల, అప్పటి కలెక్టర్‌ కర్ణన్‌ ప్రత్యేక శ్రద్ధతో రామదాసు జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతిఏటా కంచర్లగోపన పదో తరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావు భక్తరామదాసుకు పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ ధ్యాన మందిరానికి సరైన నిర్వహణ కొరవడింది. భక్తులు, పర్యాటకులు వచ్చినప్పుడు వారికి కనీస సౌకర్యాలైన తాగునీరు, శౌచాలయాలు కూడా లేవు. కేవలం ఓ పూజారి మాత్రమే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. భక్తరామదాసు జయంత్యుత్సవాలను స్థానికంగా ఓ రిజిస్టరు సొసైటీ నిర్వహిస్తుండగా పూర్తి స్థాయిలో ధ్యాన మందిరానికి కమిటీ వేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను భద్రాచలం దేవస్థానం కమిటీలో సభ్యులుగా చేర్చాలని విన్నవిస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. భద్రాచలం దేవస్థాన నిర్మాతను, శ్రీరామునిపై సుమారు 200 కీర్తనలు, దాశరథి శతక రూపశిల్పి, ఆనందభైరవి రాగమును మొట్టమొదటి సారిగా ఉపయోగించిన ఆ భక్తరామదాసుపై ప్రభుత్వం శీతకన్ను వేయడం విమర్శలపాలవుతోంది.

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని