logo

‘రైతులను మోసగించిన భాజపా’

నల్ల చట్టాల రద్దుపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, పార్లమెంటు సమావేశాల్లో నల్ల చట్టాల రద్దు బిల్లును అజెండాలోకి తీసుకురాలేదని వామపక్ష రైతు సంఘాల జిల్లా నేతలు ఆరోపించారు.

Published : 27 Jan 2023 02:47 IST

వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ

ర్యాలీలో మాట్లాడుతున్న బాగం హేమంతరావు

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: నల్ల చట్టాల రద్దుపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, పార్లమెంటు సమావేశాల్లో నల్ల చట్టాల రద్దు బిల్లును అజెండాలోకి తీసుకురాలేదని వామపక్ష రైతు సంఘాల జిల్లా నేతలు ఆరోపించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు ఖమ్మంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్‌ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ మయూరి సెంటర్‌, అంబేడ్కర్‌ కూడలి, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, రోటరీనగర్‌, శ్రీశ్రీ సర్కిల్‌ మీదుగా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ) వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం అనుబంధ రైతు సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. రైతుల పట్ల నరేంద్రమోదీ సర్కారు తీరు మారకుంటే మరో రైతు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. భాజపా వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్త ఉద్యమంతో నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం చట్టం రూపంలోకి తీసుకురావడంలో వెనకడుగు వేస్తోందని మండిపడ్డారు. నూటికి 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్పొరేట్‌ సంస్థలకు రూ.లక్షల కోట్లు రాయితీలను రద్దు చేస్తున్న భాజపా రైతుల అప్పులపై కనీస ఆలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు సంస్కరణ బిల్లుతో రైతుల నడ్డివిరిచే ప్రయత్నం జరుగుతుందని, తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనేక దశాబ్దాలుగా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలని రైతులు పోరాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష రైతు సంఘాల నేతలు దొండపాటి రమేశ్‌, మాదినేని రమేశ్‌, ప్రకాశ్‌, మరీదు నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు, ప్రజా సంఘాల నాయకులు ఎస్‌కె.జానిమియా, బొంతు రాంబాబు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని