logo

అంగన్‌వాడీలకు సాంకేతిక దన్ను

ప్రస్తుతం అన్ని రంగాలు సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకెళ్తున్నాయి. ప్రతీ పనిని సులభతరం చేసుకుంటున్నాయి. సంక్షేమ విభాగంలోని అంగన్‌వాడీ కేంద్రాలూ అదే బాటలో పయనిస్తున్నాయి.

Published : 27 Jan 2023 02:47 IST

ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌తో పారదర్శకత

ఖమ్మం కమాన్‌బజార్‌, పినపాక, న్యూస్‌టుడే: ప్రస్తుతం అన్ని రంగాలు సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకెళ్తున్నాయి. ప్రతీ పనిని సులభతరం చేసుకుంటున్నాయి. సంక్షేమ విభాగంలోని అంగన్‌వాడీ కేంద్రాలూ అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ కేంద్రాలు తమ పరిధిలో 16 రకాల రిజిస్టర్లను నిర్వహిస్తాయి. గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య సంబంధిత సమాచార సేకరణ అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు భారమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ‘న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌(ఎన్‌హెచ్‌టీఎస్‌)’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నమోదు తప్పనిసరి...

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు విధులకు ఎప్పుడు హాజరవుతున్నారు, ఏ రోజు ఎంతమంది పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు పోషకాహారాన్ని అందించారు అనే అంశాలను పొందుపరచాలంటే సిబ్బంది తమ చరవాణిలో ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని నమోదు చేసుకోవాలి. ఆధార్‌ను అనుసంధానం చేసిన తర్వాత ఒక ఐడీ జనరేట్‌ అవుతుంది.


ఎందుకీ యాప్‌....

రిజిస్టర్లు, కాగితాల విధానానికి స్వస్తి పలికి, సాంకేతికతను జోడిస్తూ, అంగన్వాడీ కేంద్రాలపై 24/7 అధికారుల పర్యవేక్షణ ఉండేలా ఇది దోహదపడుతుంది. దీంతో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు తప్పనిసరిగా ఈ యాప్‌లో నమోదు కావాల్సి ఉంటుంది. కేంద్రాలను టీచర్లు ఎప్పుడు తెరుస్తున్నారు, హాజరవుతున్నారా? లేదా అనే అంశాలు అధికారులకు తెలుస్తాయి. దీంతో పనిలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుంది. సేవలను పొందే వారందరి సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, 6 సంవత్సరాల పిల్లలకు సరైన సమయంలో పాలు, గుడ్లు, బాలామృతం తదితర పోషకాహారం అందిస్తున్నారా? కేంద్రాల్లో సరిపడా ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయా? అనే సమాచారాన్ని సిబ్బంది యాప్‌లో పొందుపరుస్తారు.


పర్యవేక్షణ మరింత సులభం...

ఈ యాప్‌ అందుబాటులోకి రాక ముందు అంగన్‌వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేస్తున్నాయా, ప్రభుత్వం అందించే అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయా, లేవా అనే వివరాలను జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీవో, పర్యవేక్షకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దేశంలోని ఏ అధికారి అయినా సులభంగా ఎక్కడి నుంచైనా కేంద్రాలను పర్యవేక్షించే అవకాశం ఉంది.


రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెచ్చిందంటే...

పోషణ ట్రాకర్‌ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలలో అందుబాటులో ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అందించే సేవలు, లబ్ధిదారుల వివరాలను సైతం యాప్‌లో పొందుపరచాలనే ఉద్దేశంతో ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌ను రూపొందించారు. అంగన్‌వాడీ కేంద్రాల సేవలు వైద్యం, పంచాయతీరాజ్‌, గ్రామీణభివృద్ధి శాఖలతో ముడిపడి ఉంటాయి. వీటి సమన్వయం చేసుకుంటూ, పారదర్శకత, నాణ్యతగల సేవలను అందించడం కోసం దీన్ని రూపొందించారు.


వృథాను అరికట్టవచ్చు
సీహెచ్‌ సంధ్య, జిల్లా సంక్షేమ అధికారి

గతంలో కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసే పోషకాహార సరకులు పెద్ద మొత్తంలో వృథా అయ్యేవి. అక్రమాలకు తావుండేది. యాప్‌ వచ్చాక పారదర్శకత పెరిగింది. సరకులు పక్కదారికి పట్టే అవకాశం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని