logo

జాతి రత్నాలు.. ఏజీ పూర్వ విద్యార్థులు

అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు తమ కీర్తి పతాకను జాతీయ స్థాయిలో దిల్లీలోనూ ఎగురవేశారు. విశ్వవిద్యాలయం స్థాయిలోనే గాక జాతీయ స్థాయిలోనూ ప్రథమ స్థానం మనదేనని నిరూపించారు.

Published : 27 Jan 2023 02:47 IST

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు తమ కీర్తి పతాకను జాతీయ స్థాయిలో దిల్లీలోనూ ఎగురవేశారు. విశ్వవిద్యాలయం స్థాయిలోనే గాక జాతీయ స్థాయిలోనూ ప్రథమ స్థానం మనదేనని నిరూపించారు. ఈనెల 12న ప్రకటించిన జాతీయస్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (అగ్రికల్చర్‌ శాస్త్రవేత్తల రిక్రూట్‌మెంటు బోర్డు)లో వందల మంది పోటీపడ్డా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏజీబీఎస్పీ పూర్తిచేసి పీజీ, పీహెచ్‌డీ చేస్తున్న ఎన్‌.అశ్వని జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. జెనిటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. బంగారు పతకాలు అశ్విని వెంటే వచ్చాయి అంటే సరిపోతుంది. ఏజీబీఎస్సీలో బంగారు పతకంతో పాటు 3 రజత పతకాలు, విశ్వవిద్యాలయం స్థాయిలో 6 బంగారు పతకాలు, దిల్లీలో ఏజీ ఎంఎస్సీలో బంగారు పతకం వచ్చింది. ప్రస్తుతం ఇక్రిశాట్‌లో మూడో సంవత్సరం పీహెచ్‌డీ పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. ఉన్నత ప్రతిభ చూపుతూ జాతీయ స్థాయిలో వ్యవసాయ శాస్త్రవేత్తల నియామకాల్లో మొదటి స్థానంలో నిలిచిన అశ్విని తల్లితండ్రులు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో వ్యవసాయ కుటుంబం.


జాతీయ స్థాయిలో మెరిసిన షణ్ముఖ

అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏజీబీఎస్సీ పూర్తి చేసిన మరో విద్యార్థిని షణ్ముఖ జాతీయ స్థాయిలో  వ్యవసాయ శాస్త్రవేత్తగా అయిదో స్థానంలో నిలిచారు. షణ్ముఖ తండ్రి ఉప్పల్‌లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి కుటుంబ బాధ్యతలు చేస్తూన్నారు. ఏజీబీఎస్సీలో ఉత్తమ ఓజీపీఏతో ఉత్తీర్ణత సాధించి ఎమ్మెస్సీలో జాతీయ స్థాయిలో 11వ, పీహెచ్‌డీలో అయిదో ర్యాంకు సాధించిన షణ్ముఖ కళాశాలలో ఎంచుకున్న తన లక్ష్యాన్ని నేడు చేరుకున్నారు. వ్యవసాయ విస్తరణ విభాగంలో శాస్త్రవేత్తగా నియమితులయ్యారు. వ్యవసాయ పరిశోధనా ఫలాలను రైతులకు చేరవేయడంలో విస్తరణ విభాగానిదే అసలైన ప్రాధాన్యం అంటారు షణ్ముఖ.


ఎంటమాలజీ శాస్త్రవేత్తగా కె.శ్రీనివాసరావు

అశ్వారావుపేటకు చెందిన మరో విద్యార్థి కె.శ్రీనివాసరావు ఎంటమాలజీ విభాగంలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఎంతోమంది పోటీపడగా వారిలో 11వ స్థానంలో నిలిచిన శ్రీనివాసరావు ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు ఏజీబీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి, పీజీ హైదరాబాదులో పూర్తి చేశారు. తల్లితండ్రులది వ్యవసాయ కుటుంబం. ఎంటమాలజీలో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం అంటే రైతుకు సేవచేసే అవకాశం తనకు లభించినట్లే అంటారు శ్రీనివాసరావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని