logo

జనగణమన..ప్రగతి పథాన

ఎందరో మహనీయులు ప్రాణాలర్పించి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని.. మరెందరో మహానుభావులు శ్రమించి భారతావని సమగ్రాభివృద్ధికి రాజ్యాంగాన్ని రచించారని.. అదే స్ఫూర్తితో జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు.

Published : 27 Jan 2023 03:03 IST

నూతన సమీకృత కలెక్టరేట్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

మాట్లాడుతున్న గౌతమ్‌

ఈటీవీ, ఖమ్మం: ఎందరో మహనీయులు ప్రాణాలర్పించి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని.. మరెందరో మహానుభావులు శ్రమించి భారతావని సమగ్రాభివృద్ధికి రాజ్యాంగాన్ని రచించారని.. అదే స్ఫూర్తితో జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఖమ్మంలోని నూతన సమీకృత కలెక్టరేట్‌లో గురువారం ప్రసంగించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

కలెక్టర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

* కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం కింద జిల్లాలో 15,81,782 మందికి పరీక్షలు నిర్వహిస్తాం. అవసరమైన వారికి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తాం.

* దళితబంధు పథకం కింద 3,462 మందికి రూ.346.20కోట్ల యూనిట్లు అందజేశాం.

* ధరణి వెబ్‌సైట్‌తో జిల్లాలో దీర్ఘకాలిక భూసమస్యలకు పరిష్కారం లభిస్తోంది. 45,667 దరఖాస్తులు స్వీకరించి 38,861 దరఖాస్తులు పరిష్కరించి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు అందజేశాం.

కలెక్టర్‌ గౌతమ్‌ నుంచి ప్రశంస పత్రం అందుకుంటున్న ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ  ఏలూరి శ్రీనివాస్‌, చిత్రంలో అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్‌, అదనపు డీసీపీ శబరీష్‌

* రైతుబంధు పథకం ద్వారా 2022 యాసంగిలో 3,02,057 మంది రైతులకు రూ.295.74 కోట్లు పంపిణీ చేశాం. రైతు బీమా కింద 298 కుటుంబాలకు రూ.14.90 కోట్ల పరిహారం అందించాం.

* మన ఊరు- మన బడి కార్యక్రమం మొదటి విడతలో 426 పాఠశాలలను రూ.135 కోట్లతో ఆధునికీకరిస్తున్నాం. ఈపనుల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

* ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులతో ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. రూ.100 కోట్లతో గోళ్లపాడు ఛానల్‌ ఆధునికీకరణ పనులు చేపట్టాం.

* పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా కార్యాలయాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రభుత్వం రూ.53.20 కోట్లతో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని నిర్మించింది.

జాతీయ జెండాకు వందనం చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు తదితరులు

169 మందికి ప్రశంస పత్రాలు..

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 156 మంది అధికారులు, ఉద్యోగులు, 13 మంది క్రీడాకారులకు ప్రశంస పత్రాలను కలెక్టర్‌ గౌతమ్‌ అందజేశారు. వీరిలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు మాత్రమే జిల్లాస్థాయి అధికారి. కామేపల్లి మండలం కొమ్మినేపల్లి, వైరా మండలం గరికపాడు, చింతకాని మండలం లచ్చగూడెం, రఘునాథపాలెం మండలం హర్యాతండా, తల్లాడ మండలం తెలగవరం, నేలకొండపల్లి మండలం మోటాపురం పంచాయతీలు ప్రశంస పత్రాలు అందుకున్నాయి. జిల్లా న్యాయమూర్తి డా.టి.శ్రీనివాసరావు, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషణం, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఉమా మామహేశ్వరరావు, అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, శిక్షణ కలెక్టర్‌ రాధికా గుప్తా, అదనపు డీసీపీ శబరీష్‌, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్‌ విక్రమ్‌సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.


రఘునాథపాలెం: వేపకుంట్లలో 74 అడుగుల త్రివర్ణ పతాకంతో..

భారీ జాతీయ పతాకాలు తయారుచేసే ఖమ్మం నగరానికి చెందిన ‘ఫ్లాగ్స్‌ అండ్‌ పోల్స్‌’ కేంద్రం యజమాని పద్మావతి.. హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కులో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఒక్కొక్క జాతీయ పతాకం తయారీకి 10-12 మంది సభ్యుల బృందానికి వారం రోజులు పడుతుందన్నారు. ఖర్చు రూ.1,12,000 వరకు అవుతుందని, దేశంలోని 25 రాష్ట్రాలకు జాతీయ జెండాలను పంపుతున్నామన్నారు.


సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలి: జిల్లా జడ్జి

జిల్లా కోర్టులో జెండాకు వందనం చేస్తున్న న్యాయమూర్తి టి.శ్రీనివాసరావు తదితరులు

ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: సమాజంలో సాంఘిక దురాచారాలైన అవినీతి, వరకట్నం, భ్రూణహత్యలను రూపుమాపడానికి సమష్టిగా కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ టి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో మువ్వన్నెల పతాకాన్ని గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఇటువంటి సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆర్‌.డానీరూథ్‌, ఎన్‌.సంతోష్‌కుమార్‌, ఎన్‌.అమరావతి, మహ్మద్‌ అబ్దుల్‌ జావీద్‌ పాషా, కె.ఆషారాణి, ఎన్‌.వెంకటహైమ పూజిత, ఎన్‌.శాంతి సోని, పి.మౌనిక, ఎ.ఆశాలత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోలీసు కమిషనర్‌ కార్యాలయం, పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ పరేడ్‌ మైదానంలో అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) డాక్టర్‌ శబరీష్‌, పోలీసు శిక్షణ కేంద్రం, సిటీ ఆర్ముడ్‌ రిజర్వ్‌ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌, శ్రీకృష్ణ ప్రసాద్‌ మెమోరియల్‌ స్కూల్‌లో అడిషనల్‌ డీసీపీ(ఏఆర్‌) కుమారస్వామి, ఖమ్మంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ బొల్లినేని ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ రామోజు రమేష్‌, సీసీఆర్బీ ఏసీపీ వెంకటస్వామి, ఎస్‌బీ ఏసీపీ ప్రసన్నకుమార్‌, సీసీఎస్‌ ఏసీపీ రవి, కార్యాలయ ఏవో అక్తరున్నీసాబేగం, ఆర్‌ఐలు సాంబశివరావు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

* ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో ఆర్‌ఎం ఎస్తర్‌ ప్రభులత, జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో జయప్రకాశ్‌, ఖమ్మం అగ్నిమాపక కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌వో పిన్నింటి రాజేశ్వరరావు జాతీయ పతాకాలు ఎగురవేశారు.  

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్‌ తదితరులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సీఈవో వింజం అప్పారావు జాతీయ జెండా ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని