logo

మామిడి రైతుకు చేదు అనుభవం

రెండేళ్లుగా నష్టాల ఊబిలో చిక్కుకున్న మామిడి రైతులు.. ఈసారైనా లాభాల రుచి చూడాలని ఆశించినా పరిస్థితులు అనుకూలించటం లేదు.

Published : 29 Jan 2023 03:08 IST

ఈటీవీ, ఖమ్మం

పూతదశలోనే ఎండిపోతున్న మామిడి చెట్లు

రెండేళ్లుగా నష్టాల ఊబిలో చిక్కుకున్న మామిడి రైతులు.. ఈసారైనా లాభాల రుచి చూడాలని ఆశించినా పరిస్థితులు అనుకూలించటం లేదు. తామర పురుగు, ఇతర తెగుళ్ల దెబ్బతో మామిడి తోటలన్నీ వాడిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు పురుగుమందులు పిచికారి చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది దిగుబడులు క్షీణించి.. అంతకుముందు కొవిడ్‌ మహమ్మారితో నష్టాల పాలయ్యామని చెబుతున్నారు.

కాత దశలో కష్టాలు..

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 45వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, కారేపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ, ముల్కలపల్లి, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, జూలూరుపాడు మండలాల్లో రైతులు పండిస్తున్నారు. తోతాపురి, బంగినపల్లి, రసాల్‌, హిమాయత్‌, దశేరీ, కేసరి, రాయల్‌ స్పెషల్‌, చిన్నరసాలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. తామర పురుగు, ఇతర తెగుళ్లు సోకటంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. సీజన్‌ ఆరంభం నుంచీ పూత దశ వరకు రైతులు ఆశించిన మేర కనిపించిన మామిడి తోటలు.. తామర పురుగు, తెగుళ్లు సోకటంతో తేలిపోతున్నాయి.

దిగుబడి దిగులు

మామిడి తోటలను కాపాడుకునేందుకు సాగుదారులు అష్టకష్టాలు పడుతున్నారు. పూత దశ దాటి కాత వచ్చే సమయంలో తామర పురుగుతోపాటు ఇతర తెగుళ్ల నివారణకు ఇబ్బడిముబ్బడిగా పురుగుమందులు పిచికారి చేస్తున్నారు. ఒక్కో రైతు ఒక్కసారి మందుల పిచికారికి సుమారు రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నారు. ఒక్కొక్కరు ఇప్పటికే ఐదుసార్లు పురుగుమందులు పిచికారి చేసినా ఆశించిన ఫలితం కానరావటం లేదు. సాధారణంగా ఎకరాకు 10 టన్నుల దిగిబడి రావాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రెండు, మూడు టన్నులూ వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.


నివారణ చర్యలు చేపట్టాలి

మరియన్న ఉద్యానశాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం

మిర్చి పంటలకు ఆశించినట్లే ప్రస్తుతం మామిడి తోటలకు తామర పురుగు సోకుతోంది. పూత ఎండి పిందె రాలిపోవడం, కాయపగలటం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నివారణకు 1గ్రాం జింక్‌ సల్ఫేట్‌+ 1గ్రాం బోరాన్‌ లీటరు నీటికి కలిపి పూమొగ్గ పెరిగే దశలో చెట్లు తడిచేలా పిచికారి చేయాలి. లీటరు నీటికి గ్రాము కార్బండాజిమ్‌ కలిపి పిచికారి చేస్తే పూత, పెందె దశలో ఆకుమచ్చ వ్యాప్తిని అరికట్టవచ్చు.


మూడేళ్లుగా నష్టాలే

సయ్యద్‌ నబీ, కల్లూరు

25 ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నాను. మూడేళ్లుగా నష్టాలే మిగులుతున్నాయి. ఈసారి మరీ దారుణం. తామరపురుగు ఉద్ధృతితో ఐదుసార్లు మందులు పిచికారి చేశాను. 80 చెట్లకు రూ.20వేలు వెచ్చించాను. అయినా పంట చేతికొచ్చేలా కనిపించట్లేదు.


పెట్టుబడులు వచ్చేలా లేవు

దేశిరెడ్డి నాగిరెడ్డి, రేజర్ల

పదెకరాల్లో మామిడి సాగుచేస్తున్నాను. తామర పురుగు, తేనెమంచుతో తోటలు మాడిపోయి పూత రాలిపోతుంది. ఎకరాకు రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టాను. రూ.వేలు వెచ్చించి పురుగు మందులు పిచికారి చేసినా ఫలితం లేదు. ఈఏడాది పెట్టుబడులు వచ్చే పరిస్థితులూ లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు