logo

ఉపాధి కుదింపు

గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కలిగించేందుకు 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.

Published : 29 Jan 2023 03:08 IST

కొత్తగూడెం అర్బన్‌, కొత్తగూడెం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే

గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కలిగించేందుకు 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. నోటిఫైడ్‌ వేతన రేటుతో నైపుణ్యం లేని పనిని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామాభివృద్ధికి అవసరమైన పనులతో పాటు నీటినిల్వకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశిస్తూ..

నిరుపేదలకు ఉపాధి కల్పిస్తూ దీర్ఘకాలిక ప్రయోజనాలుండే పనులకే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. పరికరాల వినియోగం, ప్రజాప్రయోజనం తదితర అంశాలను మేళవించి పనులను రూపొందించారు. సాగు భూములకు అనుసంధాన రహదారులు నిర్మించడం, ఉపరితల నీటి నిల్వల ట్యాంకుల అభివృద్ధి, కాల్వలు, చెరువుల్లోని పూడిక తొలగింపు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. హరితహారం గుంతల తవ్వకం, కంచెల ఏర్పాటు వంటి 170 రకాల పనులు ఉపాధి హామీ పథకంలో చేపట్టేలా ప్రణాళికలు రచించారు. ఉభయ జిల్లాల్లో 2022-23లో ఉపాధి కల్పనల పనిదినాలు 1.75 కోట్లు ఉండగా.. 2023-24లో 1.16 కోట్లకు కుదించారు.

అక్రమాలకు అడ్డుకట్ట పడేలా..

ఆధార్‌తో జాబ్‌కార్డును అనుసంధానించుకున్న కూలీలు మాత్రమే ఉపాధి పనులు చేసేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూలీల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యేలా చూస్తున్నారు. తద్వారా ఉపాధి పనులు చేయకుండా వేతనాలు పొందటం లాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఉభయ జిల్లాల్లోని 44 మండలాల్లో 1,070 గ్రామపంచాయతీల్లో 5,34,113 జాబ్‌కార్డులకు 4,16,085 కార్డులకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం మండలాల్లో సామాజిక తనిఖీ జరుగుతుండటంతో మిగతావారి ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలో జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

11,80,376 మంది కూలీలకు..

ఉభయ జిల్లాల్లోని 11,80,376 మంది ఉపాధి కూలీలకు మొత్తమ్మీద 1.16 కోట్ల దినాల్లో పని కల్పించాలని అధికారులు లక్ష్యం విధించారు. 44 మండలాల పరిధిలోని 1,070 పంచాయతీలు, 757 గ్రామాల్లో పనులు నిర్వహిస్తున్న కూలీల సంఖ్య ఆధారంగా గ్రామసభల తీర్మానాల మేరకు లక్ష్యాన్ని నిర్దేశించారు.


ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి పనిదినాల లక్ష్యం ఖరారైంది. కూలీలు తమ జాబ్‌కార్డ్‌కు ఆధార్‌ను అనుసంధానించుకోవాలి. ఆధార్‌ నకల ప్రతులపై జాబ్‌కార్డు నంబర్‌ నమోదుచేసి సంబంధిత క్షేత్రసహాయకులు, ఏపీవోలు, కార్యదర్శులు, ఎంపీడీవోలకు అందించాలి. జాబ్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానమైతే కూలీల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమవుతాయి.

మధుసూదన్‌రాజు, డీఆర్డీవో, భద్రాద్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని