logo

ప్రణాళిక అనుసరిస్తే తల్లీబిడ్డా క్షేమం

కూసుమంచికి చెందిన కె.త్రివేణి అనే గర్భిణికి తీవ్రంగా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను 108లో మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవం అయ్యి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Published : 29 Jan 2023 03:08 IST

సత్తుపల్లి, న్యూస్‌టుడే

ఇటీవల 108లో ప్రసవించినగర్భిణి

కూసుమంచికి చెందిన కె.త్రివేణి అనే గర్భిణికి తీవ్రంగా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను 108లో మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవం అయ్యి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఖమ్మం దానవాయిగూడెం నుంచి జిల్లా ఆస్పత్రికి అంబులెన్సులో గర్భిణిని తరలిస్తుండగా జడ్పీ సెంటరుకు చేరుకోగానే నొప్పులు అధికమవడంతో రహదారి వెంబడి వాహనం నిలిపి సిబ్బంది కాన్పు చేశారు.

మారుమూల మన్యం ప్రాంతంలోనే కాదు. పట్టణాలు, ఆస్పత్రులకు చేరువలో ఉన్న గ్రామాల నుంచి పురిటి నొప్పులతో గర్భిణులను తరలిస్తుండగా మార్గమధ్యలోనే కాన్పులు చేయాల్సి వస్తోంది. అంబులెన్సుల్లో వైద్య సిబ్బంది ఉండటంతో ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నా.. ప్రైవేటు వాహనాల్లో తరలిస్తుండగా ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వారిలో హైరిస్క్‌ కేసులుంటే ప్రాణాంతకమే అవుతుంది. అధునాతన వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నా.. ఇలాంటి పరిస్థితులకు ప్రధానంగా అవగాహన లోపమే కారణమవుతోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ బర్త్‌ప్లాన్‌ను అనుసరిస్తే తల్లీబిడ్డా సురక్షితంగా బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఎందుకిలా?

వైద్య సిబ్బంది సలహాలు, సూచనలు పాటించకుండా, నొప్పులు వచ్చేంత వరకు ఇళ్ల వద్దే ఉంటూ పురిటినొప్పులు ఎక్కువై హడావిడిగా ఆస్పత్రులకు తరలించే సమయంలో మధ్యలోనే ప్రసవాలు అయ్యి తల్లీబిడ్డా ఇబ్బందులు పడిన సందర్భాలు లేకపోలేదు. ఒక్కోసారి 108 వాహనాలు వేరే ప్రాంతాలకు వెళ్లినపుడు సరైన వాహన సదుపాయాలు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.ఏడు నెలలకే కాన్పులు కావడం, పుట్టిన బిడ్డ బరువు తక్కువ, పలు అనారోగ్య కారణాలతో జన్మించి అస్వస్థతకు గురికావడం వంటి అనేక   ఘటనలు ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకున్నాయి.

వైద్యసిబ్బంది పర్యవేక్షణ

హైరిస్క్‌ గర్భిణులను ముందుగానే గుర్తించి వారికి పరీక్షలు చేయించి అవసరమైన మందులను ఇచ్చి సురక్షితమైన కాన్పులు జరిగేలా ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు వ్యవహరించాల్సి ఉంటుంది. సాధారణ కాన్పుల కోసం సమకూర్చుతున్న వ్యాయామ సదుపాయాలను గర్భిణులు సద్వినియోగం చేసుకునేలా మిడ్‌వైఫరీ నర్సులు చూడాలి. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని గర్భిణులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. నాలుగో చెకప్‌ మాత్రం గైనకాలజిస్ట్‌తోనే చేయించుకోవాలి. అవసరమైన టీకాలతోపాటు ప్రతి గర్భిణికి సాధారణ కాన్పు, శస్త్రచికిత్సలపై అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేస్తుంటారు. పురిటినొప్పులు, సాధారణ నొప్పులకు తేడాలను ప్రతి గర్భిణీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రసవం తేదీకి రెండుమూడు రోజుల ముందు ఆసుపత్రిలో చేరి వైద్యుల పర్యవేక్షణలో ఉంటే కాన్పు ఎలాంటి రిస్క్‌ లేకుండా చేసేందుకు వీలుంటుంది.

బర్త్‌ప్లాన్‌ అమలు తీరిది

మతాశిశుమరణాలు తగ్గించాలనే సంకల్పంతో ప్రభుత్వం రిప్రొడక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ కేర్‌ (ఆర్‌సీహెచ్‌) కింద బర్త్‌ప్లాన్‌ను తీసుకొచ్చింది. గర్భం దాల్చిన తర్వాత బర్త్‌ప్లాన్‌లో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వైద్య, రక్తపరీక్షల అనంతరం ఆరు నెలల వరకు గర్భిణులకు ఆశాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చెకప్‌లు చేయించడం, ఆ తర్వాత 7, 8, 9 నెలల్లో సీహెచ్‌సీల్లో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సదరు గర్భిణి ఎక్కడ కాన్పు చేయించుకుంటారో ముందే నమోదు చేసుకోవాలి.


‘ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఆరు నెలల కాలంలో దాదాపు 50 మంది గర్భిణులకు 108లో కాన్పులు జరిగాయి.’


నెలలు నిండిన తర్వాత చెకప్‌లు చేయించుకోవాలి

బి.విజయలక్ష్మి, గైనకాలజిస్ట్‌,సత్తుపల్లి సీహెచ్‌సీ

నెలలు నిండిన తర్వాత వారానికోసారి గర్భిణులు చెకప్‌లు చేయించుకోవాలి. ప్రసవం సమయం సమీపించే క్రమంలో ముందుగానే ఆసుపత్రుల్లో చేరి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. గర్భిణులు రెగ్యులర్‌గా ఏఎన్‌సీ చెకప్‌లు చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మధ్యలో రక్తస్రావం అయినా, ఉమ్మనీరు వస్తున్నా, వెనుక భాగంలో నొప్పులు వచ్చినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని