logo

రథ సప్తమి వేళ చంద్రప్రభ వాహన సేవ

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం రథ సప్తమి సందర్భంగా చంద్ర ప్రభ వాహన సేవ నిర్వహించారు.

Published : 29 Jan 2023 03:08 IST

సీతారాముల వారి వెండి రథ సేవ

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం రథ సప్తమి సందర్భంగా చంద్ర ప్రభ వాహన సేవ నిర్వహించారు. వెండి రథ సేవ చేశారు. దేవతామూర్తులకు నూతన వస్త్రాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించారు. బంగారు తులసీదళాలను స్వామి పాదాల వద్ద ఉంచి మొక్కుకున్నారు. వారానికి ఒకసారి కొనసాగే ఈ వేడుకను వైదిక పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఉప ప్రధానార్చకుడు రామస్వరూప్‌ ఆధ్వర్యంలో నిత్య కల్యాణంలో భాగంగా మాంగళ్యధారణ తలంబ్రాల వేడుక నిర్వహించారు. దర్బారు సేవ భక్తిశ్రద్ధలను పెంచింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ తివారీ రాములవారిని దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్‌ నిరంజన్‌ స్వాగతం పలకగా వైదిక పెద్దలు ఆశీర్వచనం పలికారు. హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన భక్తులు రామకోటి పుస్తకాలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు.

నేటితో వాగ్గేయకారోత్సవాల ముగింపు

శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వాగ్గేయకారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం కళాకారులు ఆలపించిన కీర్తనలు ఆధ్యాత్మికతను చాటాయి. నాదస్వరం వీనుల విందు చేసింది. ప్రతి గళం కోకిల గానమై నిలిచింది. మృదంగం, వయోలిన్‌ ద్వారా పలికిన సంగీతం శ్రోతలను రస సాగరంలో ముంచెత్తింది. రామదాసు జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.


నగరంలోని ఆలయాల్లో..

పర్ణశాల రామాలయంలో సూర్యభగవానుడికి అభిషేకం

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: రథ సప్తమిని పురస్కరించుకొని నగరంలోని పలు దేవాలయాల్లో శనివారం సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ట్రంకు రోడ్డులోని శ్రీగుంటుమల్లేశ్వరస్వామి దేవస్థానం, పర్ణశాల రామాలయంలో అర్చకుల ఆధ్వర్యంలో సూర్యునికి క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేశారు. తితిదే, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో విద్యార్థులతో ఆదిత్య హృదయం, అష్టోత్తర పారాయణం చేసి సూర్య నమస్కారాలు చేయించారు. అర్చకులు దాములూరి కృష్ణశర్మ, పవన్‌ కుమారాచార్యులు, ఆలయ ఈవోలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని