logo

ఖమ్మం చేరిన కొత్త ఈవీఎంలు

భారత ఎన్నికల సంఘం జిల్లాకు కొత్తగా కేటాయించిన ఈవీఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లు శనివారం ఖమ్మం చేరుకున్నాయి.

Published : 29 Jan 2023 03:08 IST

రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్‌ గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: భారత ఎన్నికల సంఘం జిల్లాకు కొత్తగా కేటాయించిన ఈవీఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లు శనివారం ఖమ్మం చేరుకున్నాయి. రెండు క్లోజ్డ్‌ కంటెయినర్లలో వచ్చిన వీటిని కలెక్టర్‌ గౌతమ్‌ పర్యవేక్షణలో జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోదాములో భద్రపరిచారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కంటెయినర్ల నుంచి ఈవీఎంలున్న ట్రంకు పెట్టెలను హమాలీలు దిగుమతి చేసి గోదాములో క్రమ పద్ధతిలో అమర్చారు. ట్రంకు పెట్టెలను తెరచి ఈవీఎంలున్న పెట్టెలను పరిశీలించారు. 2603 బ్యాలెట్‌ యూనిట్లు, 2034 కంట్రోల్‌ యూనిట్లు మొదటి విడతగా జిల్లాకు వచ్చాయి. జడ్పీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గోదాములో ఈవీఎంలు భద్రపరిచి, అక్కడ పోలీస్‌ పోస్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు అమర్చారు. నిరంతరం పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. ఈవీఎంల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి ఈసీఐఎల్‌ ఇంజినీర్లు యంత్రాల వెంట వచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు అప్పగించారు. గోదాము వద్ద పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఖమ్మం చేరుకున్న కొత్త యంత్రాలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించనున్నారు.

పాత కలెక్టరేట్‌ ఆవరణలో ఈవీఎంల శాశ్వత గోదాము ఉంది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ఆ గోదాములో ఉండగా వాటిని పంజాబ్‌ రాష్ట్రానికి కేటాయించారు. ఒకటి, రెండు రోజుల్లో వాటిని పంజాబ్‌ తరలించనున్నారు. పాత కలెక్టరేట్‌ భవనం ప్రభుత్వ వైద్య విద్య కళాశాలకు అప్పగించినందున అక్కడి గోదాము ఖాళీ చేయాల్సి ఉంది. దీంతో ఎన్నికల సంఘం అనుమతితో జడ్పీలో తాత్కాలికంగా గోదాము ఏర్పాటు చేశారు. పాత ఈవీఎంలు పంజాబ్‌ తరలింపులో జాప్యం ఏర్పడితే వాటిని జడ్పీలోని తాత్కాలిక గోదాముకు తరలించనున్నారు. ప్రస్తుతం రెండుచోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, సూర్యనారాయణ, ఈసీఐఎల్‌ ఇంజినీర్లు భానుప్రకాశ్‌, రాజు శేషు, రాజకీయపార్టీల ప్రతినిధులు విద్యాసాగర్‌ (భాజపా), గోపాలరావు (కాంగ్రెస్‌), నాగరాజు (భారాస), లక్ష్మీనారాయణ (సీపీఐ). ప్రకాశ్‌ (సీపీఎం), కృష్ణమోహన్‌ (వైతెపా) తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు