logo

విజయ డెయిరీలో ఐదుగురిపై వేటు!

ఖమ్మం విజయ డెయిరీలో ఐదుగురిపై వేటు పడింది. ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సిబ్బందిని శనివారం సస్పెండ్‌ చేశారు. డీడీకి స్థానచలనం కలిగింది.

Published : 29 Jan 2023 03:08 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం విజయ డెయిరీలో ఐదుగురిపై వేటు పడింది. ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సిబ్బందిని శనివారం సస్పెండ్‌ చేశారు. డీడీకి స్థానచలనం కలిగింది. పాడి పరిశ్రమ సహకార సమాఖ్య జనరల్‌ మేనేజర్‌ మల్లయ్య స్వయంగా ఖమ్మం వచ్చి సంబంధిత అధికారులు, సిబ్బందికి శనివారం ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం ఉపసంచాలకుడిగా పనిచేస్తున్న సత్యనారాయణను ఇక్కడి నుంచి బదిలీ చేశారు. అతడిపైనా వేటు వేసినట్లు సమాచారం. మేనేజర్‌ భరతలక్ష్మి, గతంలో ఇక్కడ.. ప్రస్తుతం నల్గొండలో మేనేజర్‌గా పనిచేస్తున్న నరేశ్‌, ప్లాంట్‌ ఆపరేటర్‌ మణి, ల్యాబ్‌ అసిస్టెంట్‌ నాగశ్రీ సస్పెన్షన్‌కు గురైన వారిలో ఉన్నారు. ముగ్గురు హాజరుకాగా ఇద్దరు అందుబాటులో లేరు.

ఫిర్యాదులు అందటంతో.. గతంలో డెయిరీలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సుమారు రూ.34లక్షల వెన్నను పక్కదారి పట్టించటం, పాలను ప్రైవేటు డెయిరీలు, వ్యాపార సంస్థలకు అక్రమంగా విక్రయించటం, సంస్థకు చెందిన వస్తువులను అమ్ముకోవటం గురించి సంబంధిత అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. డెయిరీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడటంతో ఓ అధికారికి గతంలో షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. తాజాగా ఐదుగురిపై వేటు వేస్తూ ఉత్తర్వులు వెలువరించటం సంచలనంగా మారింది. ఈ విషయంపై పాడిపరిశ్రమ సహకార సమాఖ్య జనరల్‌ మేనేజర్‌ మల్లయ్యను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. ఇది సంస్థలోని అంతర్గత విషయమని చెప్పారు.


కొత్త డీడీగా కుమారస్వామి..

డెయిరీ ఉపసంచాలకుడు సత్యనారాయణపై బదిలీ వేటు పడటంతో ఆయన స్థానంలో వరంగల్‌ జిల్లాలో పశుసంవర్థకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కుమారిస్వామిని ఇక్కడ ఉపసంచాలకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కుమారస్వామి శనివారం బాధ్యతలు స్వీకరించారు. సత్యనారాయణను తిరిగి తన సొంత శాఖ అయిన పశుసంవర్థకశాఖకు రీపాట్రియేషన్‌ చేశారు. ఈయనపైనా చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారులు ధ్రువీకరించట్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని