logo

మట్టా దయానంద్‌కు గుండెపోటు

పెనుబల్లి మండలం అడవిమల్లేలలో శ్రీవేంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి శనివారం హాజరైన భారాస నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌ గుండెపోటుకు గురయ్యారు.

Published : 29 Jan 2023 03:08 IST

పెనుబల్లి, సత్తుపల్లి, న్యూస్‌టుడే: పెనుబల్లి మండలం అడవిమల్లేలలో శ్రీవేంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి శనివారం హాజరైన భారాస నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌ గుండెపోటుకు గురయ్యారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని, ధ్వజస్తంభం వద్ద పూజలు చేస్తుండగా ఒక్కసారిగా కూలబడిపోవడంతో అతని అనుచరులు పట్టుకొని వెంటనే సత్తుపల్లి తరలించారు. సత్తుపల్లి వైద్యశాలలో దయానంద్‌ను పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా నిర్ధారించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. దయానంద్‌ త్వరగా కోలుకోవాలని సత్తుపల్లిలో నేషనల్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అలవాల కరుణాకర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


పెళ్లింట విషాదం..

శ్రీనివాసరావు

ములకలపల్లి, టేకులపల్లి, న్యూస్‌టుడే: కుమారుని రిసెప్షన్‌కు వెళ్తూ ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. టేకులపల్లి మండలం గంగారం గ్రామీణ వైద్యుడు లక్కింశెట్టి శ్రీనివాసరావు(45)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సాయికి అశ్వారావుపేట మండలానికి చెందిన యువతితో ఈ నెల 25న పాల్వంచ పెద్దమ్మగుడి వద్ద వివాహమైంది. వధువు ఇంటి వద్ద జరిగే రిసెప్షన్‌కు కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఓ వాహనంలో బయలుదేరారు. కొంత దూరం వచ్చాక శ్రీనివాసరావు ఆ వాహనం దిగి తాను ద్విచక్ర వాహనంపై వస్తానని చెప్పి ఇంటికి వెళ్లి బైక్‌పై బయలుదేరాడు. ములకలపల్లి మండలం కొత్తగంగారం శివారు అటవీ ప్రాంతంలో గోతుల వద్ద ఇతని బైక్‌ అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు త్రీవ గాయమైంది. అటవీ ప్రాంతం కావడంతో చాలాసేపు ఎవరూ గమనించలేదు. ఆ మార్గంలో వచ్చినవారు 108కు సమాచారం ఇవ్వడంతో పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఖమ్మం తరలిస్తుండగా మార్గంమధ్యలోనే శ్రీనివాసరావు మృతి చెందాడు. కుమారుడు కార్తిక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.


విద్యుదాఘాతంతో ఒకరి మృతి

బొజ్య మృతదేహం

మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం వచ్చిన కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం శివారులో శనివారం చోటుచేసుకుంది. ఏఈ కిషన్‌లాల్‌ తెలిపిన వివరాల ప్రకారం... వెంకటాద్రిపాలెం శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్‌ పంపులో విద్యుత్తు పనుల నిమిత్తం ఏడుగురు కార్మికులను గుత్తేదారు తీసుకొచ్చారు. సదరు గుత్తేదారు.. అధికారులతో మాట్లాడి ఎల్‌సీ తీసుకుని విద్యుత్తు సరఫరా నిలిపివేయించారు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామానికి చెందిన కొరం బొజ్య(40), ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన గౌరాజు కృష్ణ మరో కార్మికుడు వీరస్వామి స్తంభం ఎక్కారు. పనిచేస్తుండగా... విద్యుత్తు సరఫరా కావడంతో బొజ్య, కృష్ణ విద్యుదాఘాతానికి గురై కిందపడ్డారు. బొజ్య అక్కడికక్కడే మృతిచెందగా కృష్ణకు గాయాలయ్యాయి. ఎల్‌సీ ఇవ్వటంలో నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఏఈ తెలిపారు. బొజ్యకు భార్య, కుమార్తె ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు