logo

ఖమ్మం రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత

ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఇద్దరు మహిళల నుంచి రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పీ స్టేషన్‌లో ఎస్సై పి.భాస్కర్‌రావు వివరాలు వెల్లడించారు.

Published : 01 Feb 2023 03:55 IST

స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితులను చూపుతున్న పోలీసులు

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఇద్దరు మహిళల నుంచి రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పీ స్టేషన్‌లో ఎస్సై పి.భాస్కర్‌రావు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రైల్వే ఎస్పీ ఎస్‌కె.సలీమా, కాజీపేట్‌ డీఎస్పీ మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సీఐలు ఎ.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు స్వప్నా నాయక్‌, సఫిరా మాలి రెండో ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో వారి వద్దనున్న 3 సంచుల్లో 14 కిలోల గంజాయిని గుర్తించారు. నిందితులు బరంపూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌కు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గంజాయిని తరలిస్తుండగా రైలు టిక్కెట్‌ తనిఖీ చేస్తున్నారని గుర్తించి ఖమ్మం రైల్వేస్టేషన్‌లో దిగారు. రెండో ప్లాట్‌ఫాంపై మరో రైలు కోసం వేచి ఉండగా పట్టుకున్నామని, గంజాయి విలువ రూ.5 లక్షలు ఉంటుందని ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు. కేసు నమోదు చేసి కాజీపేట్‌ రైల్వే న్యాయస్థానానికి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాజీపేట్‌ రైల్వే ఎస్సై కె.అశోక్‌, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.
ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆటోనగర్‌కు చెందిన కల్యాణ్‌, వరంగల్‌ క్రాస్‌రోడ్డుకు చెందిన ఎన్‌.కల్యాణ్‌, జలగంనగర్‌కు చెందిన ఫయాజ్‌ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి ప్లాస్టిక్‌ సంచిలో వేసుకొని చిన్నచిన్న పొట్లాలుగా విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా కోదాడ అడ్డరోడ్డు వద్ద ఖమ్మం గ్రామీణ పోలీసులు మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 350 గ్రాముల గంజాయి, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని