logo

స్వార్థం కోసమే పొంగులేటి పక్కచూపులు: భారాస

జనబలంతో కాకుండా అప్పటి రాజకీయ పరిస్థితుల వల్లే 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారని ఎమ్మెల్సీ, భారాస జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌ అన్నారు. 

Published : 01 Feb 2023 03:55 IST

ఖమ్మంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, చిత్రంలో జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు తదితరులు

ఈటీవీ, ఖమ్మం: జనబలంతో కాకుండా అప్పటి రాజకీయ పరిస్థితుల వల్లే 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారని ఎమ్మెల్సీ, భారాస జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌ అన్నారు.  ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం మాట్లాడారు. చాలాపార్టీలు మారి భారాసలోకి వచ్చిన పొంగులేటి.. స్వార్థంతో మళ్లీ పక్కచూపులు చూస్తున్నారని విమర్శించారు. గతంలో అనేక వేదికలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారని.. ఇప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌ను విమర్శిస్తే పెద్ద నాయకుడు అవ్చొచ్చని శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కల్లూరు మండలం నారాయణపురంలో తన పొలానికి సాగునీరు వస్తుందో లేదో చూసుకోవాలన్నారు. రూ.వేలకోట్లకు అధిపతి అయిన పొంగులేటి.. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు ఎందుకు పొందుతున్నారో చెప్పాలని మండిపడ్డారు. జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.  గత ఎన్నికల్లో అధినేత నిర్ణయానికి కట్టుబడకుండా పార్టీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. 2018 తర్వాత జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్ర పన్నారన్నారు. పాలేరులో వైఎస్‌ షర్మిలను బరిలోకి దించేది పొంగులేటి అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో లేరనుకునే భారాస కార్యకర్తలు, నేతలు ముందుకెళ్తున్నారని తెలిపారు. జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండబాల, డీసీసీబీ ఛైర్మన్‌ కురాకుల నాగభూషయ్య, మేయర్‌ నీరజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని