logo

కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

తెలంగాణలోని అతి పెద్దవాటిలో ఒకటైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ పీఠాన్ని అతి పిన్న వయస్కురాలు దోరేపల్లి శ్వేత(30) అధిష్ఠించబోతున్నారు.

Published : 01 Feb 2023 03:55 IST

ఖమ్మం మార్కెట్‌ పీఠంపై పిన్న వయస్కురాలు

దోరేపల్లి శ్వేత

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: తెలంగాణలోని అతి పెద్దవాటిలో ఒకటైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ పీఠాన్ని అతి పిన్న వయస్కురాలు దోరేపల్లి శ్వేత(30) అధిష్ఠించబోతున్నారు. 1937 జులై 17న ఇక్కడ మార్కెట్‌ కమిటీ ఏర్పాటు చేయగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ చట్టం 1966 ప్రకారం 21.10.1969 నుంచి పని చేస్తోంది. ఇప్పటి వరకు 11 మంది ఛైర్మన్లు పని చేయగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న శ్వేత రెండో మహిళా ఛైర్‌పర్సన్‌. ఈమెకన్నా ముందు డౌలె లక్ష్మీప్రసన్న పని చేశారు. ఖమ్మం నగరానికి చెందిన శ్వేత.. తండ్రి దోరేపల్లి శ్రీనివాసరావు గుత్తేదారు, తల్లి జయ గృహిణి. సోదరి శ్రుతి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈమె 10వ తరగతి వరకు స్థానిక నిర్మల్‌ హృదయ్‌ పాఠశాలలో, ఇంటర్‌ గుంటూరులోని వికాస్‌ కళాశాలలో, బీడీఎస్‌ ఖమ్మం మమత కళాశాలలో చదివారు. రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తాత నర్సయ్య భూస్వామి. వ్యవసాయంలో అపార అనుభవం ఉన్న రైతు నేతలు, సీనియర్‌ నాయకులు అధిష్ఠించిన ఈ పదవి శ్వేతకు ఒక రకంగా సవాలు వంటిదే..

జోడు పదవులకు సై...: కార్పొరేటర్‌గా ఉన్న శ్వేత మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎంపికైన తర్వాత జోడు పదవులపై పలువురికి సందేహాలు తలెత్తాయి. రెండో పదవి చేపట్టడంపై మార్కెటింగ్‌శాఖ చట్టంలో ఎలాంటి అభ్యంతరం లేదు. దీంతో రెండు పదవులనూ నిర్వహించే అవకాశం ఉంది.

ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు

మార్కెట్‌ కమిటీ 12వ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రోడ్డుకు ఇరువైపులా కటౌట్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నేడు పత్తి యార్డులో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

మార్కెట్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రచార చిత్రాలు


ఇప్పటి వరకు ఛైర్మన్లుగా పని చేసిన వారు...

పోట్ల వీరయ్య, బయ్యన్న వీరయ్య, నూతలపాటి నందమయ్య, నూకల విజయపాల్‌రెడ్డి, సామినేని హేమంతరావు, మద్ది మల్లారెడ్డి, చింతనిప్పు లాలయ్య, మానుకొండ రాధాకిశోర్‌, గుండాల కృష్ణ, మద్దినేని వెంకటరమణ, డౌలె లక్ష్మీప్రసన్న


గిట్టుబాటు ధర కల్పించటమే లక్ష్యం
- దోరేపల్లి శ్వేత, ఖమ్మం ఏఎంసీ ఛైర్‌పర్సన్‌

రైతులకు నిత్యం అందుబాటులో ఉంటా. అధికారులు, వ్యాపారులను సమన్వయం చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా కృషి చేస్తా. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. మంత్రి అజయ్‌కుమార్‌ సహకారం తీసుకుని ఏర్పాట్లు చేయిస్తా. రాష్ట్రంలోనే మోడల్‌ మార్కెట్‌గా తీర్చిదిద్దుతా.


రైతు కుటుంబం నుంచి వైస్‌ఛైర్మన్‌...

రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన షేక్‌ అఫ్జల్‌(67)  మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌గా నేడు ప్రమాణం చేయనున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1984లో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా, 2001 నుంచి 2006 వరకు రాంక్యాతండా సర్పంచిగా సేవలు అందించారు. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం ఛైర్మన్‌గా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని