logo

రామయ్య మురిసేలా..భక్తులు మెచ్చేలా..

కాలచక్రం ప్రకారం 60 ఏళ్లకోసారి ఇక్కడ సీతారామ పట్టాభిషేకం చేస్తుంటారు. ఇది 1987లో జరిగింది. ఆతర్వాత నుంచి 12ఏళ్లకోసారి పుష్కర క్రతువు నిర్వహిస్తున్నారు. తొలుత 1999, అనంతరం 2011లో పుష్కర పట్టాభిషేకం ఉత్సవాలు జరిగాయి.

Published : 01 Feb 2023 03:55 IST

* కాలచక్రం ప్రకారం 60 ఏళ్లకోసారి ఇక్కడ సీతారామ పట్టాభిషేకం చేస్తుంటారు. ఇది 1987లో జరిగింది. ఆతర్వాత నుంచి 12ఏళ్లకోసారి పుష్కర క్రతువు నిర్వహిస్తున్నారు. తొలుత 1999, అనంతరం 2011లో పుష్కర పట్టాభిషేకం ఉత్సవాలు జరిగాయి. ముచ్చటగా మూడోసారి మార్చి 22న ఉగాది నుంచి వేడుకలు మొదలయ్యే అవకాశముంది.


* శ్రీరామనవమి సెక్టార్‌లో 20వేల మంది టిక్కెట్‌ ద్వారా, 15వేల మంది ఉచితంగా కల్యాణం వీక్షించవచ్చు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్‌ను పిలుస్తారన్న ప్రచారం ఉన్నప్పటికీ స్పష్టత కొరవడింది. చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో పుష్కర పట్టాభిషేకం నిర్వహించే వీలుందని భావిస్తున్నా సందిగ్ధం వీడాల్సి ఉంది.


భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చి 30న కల్యాణం, 31న పట్టాభిషేకం నిర్వహించాల్సి ఉంది. ఈతేదీలు అధికారికంగా ఖరారు కాలేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం సమకూర్చాల్సిన వసతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

సమకూర్చాల్సిన వసతులు

* 2011లో ఆలయం వెలుపల హోమగుండాలు ఏర్పాటుచేశారు. ఈసారి వీటిని రామరథం షెడ్డు వద్ద నెలకొల్పాలని అధికారులు యోచిస్తున్నారు.

* గతంలో ఉత్సవాల సమయంలో సరైన సదుపాయాలు లేక ఇసుక తిన్నెల్లో భక్తులు బస చేశారు. రద్దీతో క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది. వేసవి కావడంతో తాగునీటి కష్టాలు ఎదురయ్యాయి. ఈ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి.

* భారీగా వాహనాలు రావడంతో పార్కింగ్‌ ప్రదేశాలు చాలలేదు. ఈసారి ట్రాఫిక్‌ చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* కాటేజీలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* బ్రహ్మోత్సవాలకు నెల ముందు నుంచే ఆన్‌లైన్‌లో ప్రచారం చేసి టిక్కెట్లను అందుబాటులో ఉంచాలి. ప్రత్యేక వెబ్‌సైట్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేయాలి.

* ఇప్పటికే కొన్ని సత్రాలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. మిగతావి ప్రైవేట్‌ పరం కాకుండా చూడాలి. ఈమేరకు దేవాదాయశాఖ మంత్రి స్థాయిలో సమీక్ష జరగాలని భక్తులు కోరుతున్నారు.

* రూట్‌మ్యాప్‌ తెలియక కొత్తగా వచ్చే యాత్రికులు తికమక పడ్డారు. సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలి.

* గోదావరిలో స్నానమాచరించేందుకు వెళ్లి లోతు తెలియక కొందరు ప్రమాదాలకు గురైన సందర్భాలున్నాయి. దీనిపై ప్రచారం కల్పించాలి.

* కల్యాణం తర్వాత ముత్యాల తలంబ్రాల కోసం భక్తులు ఎగబడుతుంటారు. రద్దీని నియంత్రించాలి. పట్టాభిషేకం సెక్టార్‌లో ఉచిత ప్రవేశంపై ప్రచారం కల్పించాలి.

* అన్నింటికీ మించి ఉత్సవ విధుల్లో ఉండే ఉద్యోగులు భక్తులతో మర్యాదగా మెలగాలి.

ప్రచారం కల్పిస్తాం: శివాజీ, ఈవో

వీలైనంత తొందరలోనే శ్రీరామనవమి ఉత్సవ వివరాలను ప్రకటించి ప్రచారం కల్పిస్తాం. వసతి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాలను తయారుచేస్తాం. సెక్టార్‌ టిక్కెట్ల ధరలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రముఖులను ఆహ్వానించే విషయం దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల    పరిశీలనలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని