logo

అన్నదాతల కంటతడి

విద్యుత్తు కోతలతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుందని రైతులు ఆనందంతో యాసంగిలో వరి సాగుకు మొగ్గుచూపారు. నాట్ల ప్రక్రియ పూర్తయ్యిందో.. లేదో విద్యుత్తు కోతలు ప్రారంభమయ్యాయి.

Updated : 01 Feb 2023 06:01 IST

విద్యుత్తు కోతలతో నీరందక ఎండుతున్న పైర్లు
ఖమ్మం రోటరీనగర్‌, దుమ్ముగూడెం, ఇల్లెందు, చర్ల, న్యూస్‌టుడే

విద్యుత్తు కోతలతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుందని రైతులు ఆనందంతో యాసంగిలో వరి సాగుకు మొగ్గుచూపారు. నాట్ల ప్రక్రియ పూర్తయ్యిందో.. లేదో విద్యుత్తు కోతలు ప్రారంభమయ్యాయి. పక్షం రోజులుగా సరిపడా నీరందక పైర్లు బీటలు వారుతున్నాయి. కళ్లెదుటే పైర్లు ఎండిపోతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.


* ఖమ్మం జిల్లాలో 1.06లక్షలు, భద్రాద్రి కొత్తగూడెంలో 47,978 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఉభయ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో 606 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఏర్పడింది. గతేడాది ఇదే సమయానికి 468మెగావాట్లు మాత్రమే ఉంది. అసాధారణంగా డిమాండ్‌ పెరగడంతో ఉపకేంద్రాలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం వరి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు, పామాయిల్‌, పప్పుదినుసులు, పండ్లతోటలు సాగవుతున్నాయి. చెరువులు, కాల్వల కింద మినహా మిగిలిన ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్ల వినియోగంతో విద్యుత్తు డిమాండ్‌ భారీగా పెరుగుతోంది.


ఇలాగైతే పంట చేతికందదు
జర్పులా రవి, విజయ దంపతులు, ధర్మాతండా, కూసుమంచి మండలం

ఉమ్మడిగా నీటిని వినియోగించుకునే బావి పరిధిలో ఎకరం విస్తీర్ణంలో వరి సాగుచేశాం. మరో అర ఎకరంలో కూరగాయలు పండిస్తున్నాం. విద్యుత్తు కోతల నేపథ్యంలో సరిపడా నీరందక వరిపైరు నిలువునా ఎండిపోతోంది. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆతర్వాత నీరందించినా పంట చేతికందదు. ఎకరం పొలం దున్నడానికి రూ.6,500, నాటు వేసేందుకు రూ.4వేలు, ఎరువుల ఖర్చు రూ.2వేలు వెరసి ఇప్పటివరకు రూ.12,500 వెచ్చించాం.


సమయపాలన పాటించట్లేదు
పేరపాక వెంకటేశ్వర్లు, చింతగుర్తి, రఘునాథపాలెం మండలం

పది రోజులుగా అధికారులు సమయపాలన పాటించకుండా ఇష్టమొచ్చినట్లు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రెండెకరాల్లో మిర్చి, మరో రెండెకరాల్లో పెసర పంట పండిస్తున్నాను. గంటకు మించి విద్యుత్తు సరఫరా కాకపోవటంతో తడిచిన సాళ్లే తడుస్తున్నాయి. కనీసం నాలుగు గంటల పాటు వరుసగా విద్యుత్తు సరఫరా చేయాలి.


చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయ్‌
లంకరాజు, రైతు, చర్ల మండలం

ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలి. ప్రభుత్వం చెప్పినట్టు 24 గంటలూ సరఫరా చేస్తే బాగుంటుంది. విద్యుత్తు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. మోటార్లు కాలిపోతున్నాయి. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తు సరఫరాలో అంతరాయాన్ని తొలగించాలి.


బోరు మోటారు కాలిపోయింది
గుగులోత్‌ మోతీలాల్‌, చుక్కలబోడు, టేకులపల్లి మండలం

రెండెకరాల్లో మిర్చి పంట పండిస్తున్నాను. విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ కారణంగా బోరు మోటారు కాలిపోయింది. మరమ్మతులకు రూ.8వేలు ఖర్చయ్యింది. అసలే మిర్చి దిగుబడి ఆశాజనకంగా లేదు. లోవోల్టేజీతో నీరందక మిరప పిందె సాగడం లేదు.


పగటిపూటే అందించాలి..
యలమంచి వంశీకృష్ణ, దుమ్ముగూడెం

తొలకరి వ్యవసాయం సమయంలో ఎడతెరిపిలేని వర్షాలు, గోదావరి వరదలతో తీవ్రంగా నష్టపోయాం. అనంతరం పంటలకు తామర, ఎర్రనల్లి, కత్తెర పురుగులు, వేరు కుళ్లు తెగుళ్లు సోకి సతమతమయ్యాం. ప్రస్తుతం విద్యుత్తు కోతలు, అంతరాయంతో మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. రాత్రి సమయాల్లో విద్యుత్తు సరఫరా చేసినా వ్యవసాయ కూలీలు అందుబాటులో లేక రైతులు విద్యుత్తును వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని పగలు ఎనిమిది గంటల పాటు విద్యుత్తు సరఫరా చేయాలి.


డిమాండ్‌కు తగినట్టు సరఫరా
ఎ.సురేందర్‌, ఎస్‌ఈ, ఖమ్మం

జిల్లాలో డిమాండ్‌కు తగినట్లు విద్యుత్తు సరఫరా అవుతోంది. ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. వ్యవసాయ రంగానికి ఆటంకం కలగకుండా సరఫరా చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని