logo

నిర్మలమ్మ పద్దు.. వేతన జీవుల వంతు..!

కేంద్ర బడ్జెట్‌లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు ప్రత్యేక కేటాయింపులేమీ దక్కలేదు. దశాబ్దాల కలగా ఉన్న గిరిజన, మైనింగ్‌ విశ్వవిద్యాలయాల ఊసెత్తలేదు.

Updated : 02 Feb 2023 05:09 IST

ఈటీవీ, ఖమ్మం

కేంద్ర బడ్జెట్‌లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు ప్రత్యేక కేటాయింపులేమీ దక్కలేదు. దశాబ్దాల కలగా ఉన్న గిరిజన, మైనింగ్‌ విశ్వవిద్యాలయాల ఊసెత్తలేదు. మరోవైపు సింగరేణికి భారీగా కేంద్రం నిధులు కేటాయించింది. పంట దిగుబడుల పెంపుదలకు ప్రాధాన్యమిచ్చింది. ఆదాయ పన్ను పరిమితిని పెంచి వేతన జీవులకు ఊరట కలిగించింది. తాజా ప్రతిపాదనలతో ఉభయ జిల్లాల్లో సుమారు 1.50 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు లబ్ధి పొందనున్నారు. బడ్జెట్‌ ప్రభావం రెండు జిల్లాలపై ఏమేరకు ఉంటుందనే కోణంలో కథనం.

‘సాగు’కు దన్ను..

వ్యవసాయ రుణ వితరణ పెంపుతో ఉభయ జిల్లాల్లో సుమారు 7.75 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. పశుపోషణ, మత్య్స సాగు, పాడి పరిశ్రమ రుణాలకు ప్రాధాన్యమిస్తామని కేంద్రం తెలిపింది. ఖమ్మం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులున్నారు. జిల్లాలో అన్ని బ్యాంకులు కలిపి వానాకాలంలో రూ.1,500 కోట్లు, యాసంగిలో రూ.900 కోట్ల మేర రుణాలు ఇస్తున్నాయి. భద్రాద్రిలో 3.25 లక్షల మంది రైతులున్నారు. వానాకాలంలో రూ.1,200 కోట్లు, యాసంగిలో రూ.600 కోట్ల రుణాలను బ్యాంకులు ఇస్తున్నాయి. 2023-24 ఏడాదిలో రుణ లక్ష్యం పెరగనుంది. పత్తి దిగుబడి పెంచేందుకు పీపీపీ ద్వారా క్లస్టర్‌ ఆధారిత విధానం అవలంబిస్తామని కేంద్రం చెబుతోంది. ఉభయ జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పత్తి పండించే 1.20లక్షల మంది కర్షకులకు మేలు జరగనుంది.  

సింగరేణికి నిధులు..

సింగరేణి అభివృద్ధికి కేంద్రం రూ.1,650 కోట్లు కేటాయించింది. ఈ నిధులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 ఏరియాల అభివృద్ధికి దోహదపడనున్నాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాలకు కేటాయింపులు దక్కనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న భారజల ప్లాంట్ల అభివృద్ధికి రూ.1,470 కోట్లు కేటాయించింది. ఈ జాబితాలో మణుగూరు భారజల ప్లాంటుకు ప్రాధాన్యం దక్కింది.

అతివలకు అండగా..

మహిళలకు అండగా నిలిచేందుకు ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌’ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని కింద గరిష్ఠంగా రూ.2లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. వడ్డీ 7.5 శాతం ఉండనుంది. ఈ పథకం ద్వారా ఉభయ జిల్లాల్లోని 12,39,386 మందికి లబ్ధి చేకూరనుంది. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌ కింద వృద్ధులకు దన్నుగా ఉండేలా పథకం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న రూ.15 లక్షల సేవింగ్‌ పరిమితిని రూ.30 లక్షలకు పెంచటంతో రెండు జిల్లాల్లో 82వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.

అనుబంధ రంగాలకు చేయూత

కేంద్రం తెచ్చిన ఆత్మనిర్భర్‌ హార్టికల్చర్‌ క్లీన్‌ ప్లాంట్‌ పథకం ఉభయ జిల్లాల్లో ఉద్యాన పంటల సాగుకు దన్నుగా నిలవనుంది. భద్రాద్రి జిల్లాలో 1,50,000 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2,20,000 ఎకరాల్లో ఉద్యాన పంటలను రైతులు పండిస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా రెండు జిల్లాల్లో 32వేల మంది మత్య్సకారులకు ప్రయోజనం చేకూరనుంది. చిన్న, సన్నకారు రైతుల కోసం సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని కేంద్రం చెబుతోంది. ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రిలో 22 పీఏసీఎస్‌లు ఉన్నాయి.


రైతు, గ్రామీణ, నిరుపేద, తెలంగాణ వ్యతిరేక బడ్జెట్‌ ఇది. రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించింది. ఉమ్మడి జిల్లాకు కనీస కేటాయింపులు లేవు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అడుగుతున్నా పట్టించుకోలేదు. రైతు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరపై ఎక్కడా ప్రస్తావించలేదు.
నామా నాగేశ్వరరావు, ఎంపీ


కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు ఒరిగిందేమీ లేదు. కేటాయింపుల్లో మరోసారి భాజపా ప్రభుత్వం మొండిచేయి చూపింది. కేవలం కార్పొరేట్ల అనుకూల బడ్జెట్‌ ఇది. విభజన హామీల ప్రస్తావనే లేదు. పీఎం కిసాన్‌ నిధి కోసం గతేడాది రూ.68 వేల కోట్లు కేటాయించగా ఈసారి రూ.60వేల కోట్లకు కుదించారు.
 పువ్వాడ అజయ్‌కుమార్‌, మంత్రి


కేంద్ర బడ్జెట్‌ నిరాశ పరిచింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి వివక్ష చూపుతున్న కేంద్రం.. బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ అదేమాదిరిగా వ్యవహరించింది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. గిరిజన, మైనింగ్‌ విశ్వవిద్యాలయాల ఆకాంక్షలను పట్టించుకోలేదు.
వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని