logo

వ్యవసాయ రంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత ప్రభుత్వం రైతు కేంద్రంగా ఏర్పడబోతోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Updated : 02 Feb 2023 05:17 IST

మాట్లాడుతున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, చిత్రంలో మంత్రి అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీలు తాతా మధు,బండ ప్రకాశ్‌, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, మేయర్‌ నీరజ తదితరులు

ఖమ్మం వ్యవసాయం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత ప్రభుత్వం రైతు కేంద్రంగా ఏర్పడబోతోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో దేశానికి  తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో భారత పత్తి సంస్థ(సీసీఐ)కి కేవలం రూ.లక్ష కేటాయించడమంటే త్వరలోనే వీటిని రద్దు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌   ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.  ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ... ఖమ్మం ఛైర్‌పర్సన్‌ పదవి ముదిరాజ్‌లకు కేటాయించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య, సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహ్రా, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు గుండాల కృష్ణ, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, భద్రాద్రి బ్యాంకు ఛైర్మన్‌ చెరుకూరి కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారోత్సవం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ దోరేపల్లి శ్వేత, వైస్‌ ఛైర్మన్‌ షేక్‌ అఫ్జల్‌తో పాటు పాలకవర్గ సభ్యులతో జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి కె.నాగరాజు, ఉన్నతశ్రేణి కార్యదర్శి ఆర్‌.మల్లేశం ప్రమాణం చేయించారు. ఉదయం 11.45 గంటలకు నూతన పాలకవర్గం మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో సంప్రదాయబద్దంగా బాధ్యతలు చేపట్టింది.
ముదిగొండ: కరోనా ప్రభావంతో రుణమాఫీకి ఆటంకం ఏర్పడిందని, వడ్డీతో సహా సర్కారే రుణమాఫీ చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మాదాపురంలో రైతువేదికను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులం, మతం పేరుతో ప్రజల మధ్య కొట్లాటలు పెట్టి లబ్ధి పొందాలనే క్షుద్ర రాజకీయాలు చేయటం తగదన్నారు. మాజీ ఎంపీ పొంగులేటికి ఇప్పటి వరకు కరెంటు కనిపించి ఇప్పుడు చీకటైందా? రాజకీయాల కోసం తెలంగాణ చీకటి అవుతుందా అని ప్రశ్నించారు. మంత్రి అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, కలెక్టర్‌ వీపీˆ గౌతమ్‌, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, ఎంపీపీ హరిప్రసాద్‌, జడ్పీటీసీ సభ్యురాలు దుర్గ, సర్పంచి వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని