logo

వసతులు కల్పించాం.. విద్యా ప్రమాణాలు పెంపొందించాలి: కలెక్టర్‌

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించామని, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంపై ఉపాధ్యాయులు దృష్టిసారించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు

Published : 02 Feb 2023 04:32 IST

స్టేషన్‌బస్తీ ఉర్దూ పాఠశాలను ప్రారంభిస్తున్న కౌన్సిలర్‌ మొగిలి లక్ష్మి, చిత్రంలో కలెక్టర్‌ అనుదీప్‌, ఎమ్మెల్యే హరిప్రియ తదితరులు

ఇల్లెందు, న్యూస్‌టుడే: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించామని, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంపై ఉపాధ్యాయులు దృష్టిసారించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.62 లక్షలతో తీర్చిదిద్దిన ఇల్లెందులోని స్టేషనుబస్తీ ప్రభుత్వ ప్రాథమిక, ఉర్దూ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్‌ ఆధ్వర్యంలో కౌన్సిలర్‌ మొగిలి లక్ష్మి బుధవారం ప్రారంభించారు. కలెక్టర్‌, ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ విద్యార్థులతో పాటు బల్లలపై కూర్చొని పాఠ్య పుస్తకాలు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనుదీప్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌లోగా జిల్లాలోని 368 పాఠశాలల్లోనూ ప్రత్యేక పనులు పూర్తిచేస్తామన్నారు. ఉపాధ్యాయులు ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేసి విద్యార్థులు చదవడం, రాయడంపై పట్టుసాధించేలా బోధన కొనసాగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పోస్టరులో స్టేషనుబస్తీ పాఠశాల చిత్రాలు ముద్రించే స్థాయిలో అధికారులు, ఉపాధ్యాయులు పనిచేశారని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ఆలోచనతో తల్లిదండ్రులు పాఠశాలల్లో కోరుకునే సదుపాయాలను కల్పించామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, పురపాలక ఛైర్మన్‌ డి.వెంకటేశ్వరరావు, వైస్‌ ఛైర్మన్‌ జానీపాషా, డీఈఓ ప్రసాద్‌, కౌన్సిలర్లు కొండపల్లి సరిత, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లా, కమిషనర్‌ షేక్‌ అంకుశ్‌ షావలీ, తహాసీల్దారు ఎం.కృష్ణవేణి, డీఈలు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, ఎంఈఓ రాంసింగ్‌, హెచ్‌ఎంలు బుచ్చయ్య, అతియా పాల్గొన్నారు. స్థానిక సమస్యలను పలువురు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

తొలివిడతలో 30,684 ఎకరాలకు పోడు పట్టాలు

కొత్తగూడెం కలెక్టరేట్: గిరిజనులకు పోడుపట్టాల జారీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ తెలిపారు. పట్టాల జారీ ప్రక్రియపై జిల్లాస్థాయి అటవీ హక్కు కమిటీ (డీఎల్‌సీ) సభ్యులతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 332 పంచాయతీల్లోని 726 హ్యాబిటేషన్ల నుంచి 65,616 మంది గిరిజనులు, 17,725 మంది గిరిజనేతరుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం నివేదికలను డీఎల్‌సీకి పంపించినట్లు వివరించారు. తొలివిడతగా కొత్తగూడెం, భద్రాచలం డివిజన్లకు చెందిన 11,532 దరఖాస్తులకు 30,684.29 ఎకరాలకు పట్టాలు జారీ చేసేందుకు డీఎల్‌సీ నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను ఎంపిక జరిగిందన్నారు. ప్రక్రియ నిస్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందని  స్పష్టం చేశారు. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు స్వర్ణలత, రత్నకళ్యాణి, ఇల్లెందు ఎఫ్‌డీఓ నీరజ్‌కుమార్‌, ఐటీడీఏ ఏపీఓ జనరల్‌ డేవిడ్‌రాజు, డీఎల్‌సీ సభ్యులు ఆళ్లపల్లి, కరకగూడెం జడ్పీటీసీ సభ్యులు కె.హనుమంతరావు, కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని