logo

అటవీ వీరుడి కుటుంబానికి అవమానం!

ఆయన అటవీ భూమిని పరిరక్షించడంలో తెగువ చూపారు... విధి నిర్వహణలోనే హత్యకు గురై ప్రాణాలు కోల్పోయాలు... ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

Published : 03 Feb 2023 03:46 IST

ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే


ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు కుటుంబానికి కేటాయించిన స్థలం

యన అటవీ భూమిని పరిరక్షించడంలో తెగువ చూపారు... విధి నిర్వహణలోనే హత్యకు గురై ప్రాణాలు కోల్పోయాలు... ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొని ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. సేవలకు గుర్తింపుగా రూ.50 లక్షల పరిహారం, 500 చ.గ ఇంటి స్థలం, భార్యకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. హామీల అమలులో భాగంగా ఇచ్చిన ఇంటి స్థలానికి ఏర్పాటు చేసిన ప్రహరీని కొద్ది రోజులకే తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది మృతుని కుటుంబాన్ని అవమానించడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పరిహారం ఇలా...

శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, 500 చగ ఇంటి స్థలం, భార్య భాగ్యలక్ష్మికి ఉద్యోగావకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఖమ్మం నగరంలో బుర్హాన్‌పురం రెవెన్యూ సర్వే నెం.93లో 500 చగ ఇంటి స్థలాన్ని కేటాయించారు. సర్వ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వ ధర ప్రకారం చదరపు గజానికి రూ.9,500 చొప్పున మొత్తం రూ.47.5 లక్షలు చెల్లించాలని కోరారు. దీన్ని పింఛనులో నెలకు 39,585 చొప్పున పదేళ్లపాటు చెల్లించేందుకు శ్రీనివాసరావు కుటుంబం అంగీకరించింది. దీంతో స్థలానికి ఉత్తర్వులను ఖమ్మం జిల్లా కలెక్టరు వీపీ గౌతమ్‌ చేతుల మీదుగా 2023 జనవరి ఒకటిన భార్య భాగ్యలక్ష్మికి అందజేశారు. సదరు స్థలానికి గూగుల్‌ మ్యాప్‌తో సహా ఖమ్మం అర్బన్‌ రెవెన్యూ అధికారులు అందించారు.

ప్రహరీ తొలగింపు...

తదుపరి శ్రీనివాసరావు కుటుంబాన్ని కలెక్టరేట్‌కు పిలిపించి ప్రహరీ నిర్మించుకోవాలని, బోరు వేసుకుని నల్లా కనెక్షను తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు రూ.2 లక్షలు వెచ్చించి సదరు స్థలానికి రెడీమేడ్‌ ప్రహరీని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఉన్న నిద్రగన్నేరు చెట్టు తొలగించేందుకు ఆ కుటుంబం అటవీ శాఖకు చలానా కూడా చెల్లించింది. కానీ రెండు రోజుల్లోనే సదరు ప్రహరీని రాత్రికిరాత్రి తొలగించడం చర్చనీయాంశమైంది. వేలాది ఎకరాల అటవీ భూమిని కాపాడి ప్రభుత్వానికి విశేష సేవలందించిన మృతుడు శ్రీనివాసరావును అవమానించడమేనంటూ దీనిపై ఈర్లపూడి గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


హత్య నేపథ్యమిదీ...

పోడు సాగుకు అడ్డు వస్తున్నాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు బీట్లో 2022 నవంబరు 22న జరిగిన గొత్తికోయల దాడిలో అటవీ శాఖ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి చలమల శ్రీనివాసరావు(40) మృతి చెందారు. దీనిపై ఆ శాఖ ఉద్యోగులు తీవ్ర నిరసన తెలిపాయి. ఆయన హత్యపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.


నీటి పారుదల శాఖ స్థల వివాదం న్యాయస్థానంలో ఉంది. ఎన్నెస్పీ ఉద్యోగులు ఈ స్థలం తమకే కేటాయించాలని గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఈ కార్యాలయం నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఉత్తర్వులు ఇచ్చినా సదరు స్థలాన్ని శ్రీనివాసరావు కుటుంబానికి స్వాధీనం చేయలేదు. ప్రత్యామ్నాయ స్థలం అన్వేషిస్తున్నాం. త్వరలోనే కలెక్టరు చేతుల మీదుగా అందజేస్తాం.

శైలజ, తహసీల్దారు, ఖమ్మం అర్బన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని