logo

గంటగంటకో దుర్ఘటన

‘ఏ నిమిషానికి.. ఏమి జరుగునో ఎవరూహించెదరు?’ అని ఓ సినీకవి అన్నట్టుగా మారింది నేటి రోడ్డు ప్రమాదాల తీరు. వాహనంతో రోడ్డెక్కిన ప్రతిసారి ప్రమాదం వెన్నంటే ఉన్నట్టు లెక్క.

Updated : 04 Feb 2023 05:43 IST

రోడ్డెక్కితే అప్రమత్తత తప్పనిసరి
వాహనచోదకులు నిబంధనలు పాటిస్తే మేలు
పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే

పాత పాల్వంచలోని బంకు వద్ద లారీని ఢీకొట్టిన ఆటో

‘ఏ నిమిషానికి.. ఏమి జరుగునో ఎవరూహించెదరు?’ అని ఓ సినీకవి అన్నట్టుగా మారింది నేటి రోడ్డు ప్రమాదాల తీరు. వాహనంతో రోడ్డెక్కిన ప్రతిసారి ప్రమాదం వెన్నంటే ఉన్నట్టు లెక్క. వాహన రద్దీ నేపథ్యంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏకాగ్రత దెబ్బతిన్నా, కనురెప్ప పాటులో ఊహించని ఘటన ఎదురవుతుంది. జీవితం తలకిందులవుతుంది. అతివేగం, నిబంధనల ఉల్లంఘన, అవగాహన లేమితో రోజులో ఏదో ఒక సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. 24 గంటల వ్యవధిలో గంటగంటకూ ఏదో ఒక సంఘటన వాటిల్లుతున్నట్లు ఇటీవల విడుదలైన కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా అన్ని రకాల రహదారులు నెత్తురోడుతున్నాయి. ఫలానా సమయంలో ఎవరూ ఉండరనే నిర్లక్ష్యంతో అతివేగం అందుకుంటే ప్రమాదంలో చిక్కినట్టేనని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

రహదారిని బట్టే వేగం అవసరం

* వేగ నియంత్రణ అన్నిటికంటే ముఖ్యమైందని ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్రవాహనాలు స్థానిక రోడ్లపై గరిష్ఠంగా 40 కి.మీ., రాష్ట్ర రహదారులపై 60 కి.మీ., హైవేలపై 80 కి.మీ. వేగం దాటొద్దు. విశాల హైవేలైతే వాహన సామర్థ్యాన్ని బట్టి వంద కి.మీ. వేగం అందుకోవచ్చు.  
* మోటారు వాహన చట్టం, సెక్షన్‌ 129 ప్రకారం వెనుక కూర్చున్న వారూ శిరస్త్రాణం ధరించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 65 శాతం ప్రమాదాలు ద్విచక్రవాహనాల కారణంగానే సంభవిస్తున్నాయి. ప్రమాద మృతుల్లో సుమారు 70 శాతం మంది తలకు గాయాలైనవారే. హెల్మెట్‌ ధరించక ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడుస్తున్నారు.
* స్థానిక రహదారులపై కార్లలో వెళ్లేవారు కొందరు సీటు బెల్టు పెట్టుకోవడం లేదు. తక్కువ వేగమే కదాని అశ్రద్ధ చేస్తున్నారు. కానీ ఎదురుగా వచ్చే వాహనం గంటకు వంద కి.మీ. వేగంతో ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది.
* గ్రామీణ రహదారుల్లో, ముఖ్యంగా మలుపుల్లో అదుపులో లేని వేగం కారు ప్రమాదాలకు కారణమవుతోంది. బావులు, వాగుల్లో దూసుకెళ్తుండటంతో ప్రాణనష్టం సంభవిస్తోంది.
* సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతోంది. సీటు బెల్టు, శిరస్త్రాణం ధరించకుండా వాహనం నడపటమూ ఓ కారణవుతోంది. కార్లలో ఎల్‌ఈడీ తెరలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
* సరకు రవాణా వాహనాల విషయంలో డ్రైవర్లు విశ్రాంతి లేకుండా నడపడం చేటు చేస్తోంది. గమ్యస్థానానికి వెళ్లాలన్న ఆత్రుత, నిద్రమత్తుతో రాష్ట్ర, జాతీయ రహదారులు నెత్తురోడేలా చేస్తున్నాయి. చోదకులు విశ్రాంతి తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలి.
* టీ తాగేందుకో, కాలకృత్యాలు తీర్చుకునేందుకు కాసేపే కదా అని రోడ్డు అంచుల్లో భారీ వాహనాలు నిలిపేస్తుండటంతో రాత్రి పూట వెనుక నుంచి ఢీకొంటున్నారు. హైవే సిబ్బంది, గస్తీ బృందాలు ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తం చేయాలి.
* అతివేగానికి మద్యం మత్తు తోడవుతోంది. తనిఖీలతో డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదాలను నివారించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని