logo

పట్టాభిషేకానికి మరో అవకాశం

అటవీ భూమిని సాగుచేసుకుంటూ.. దశాబ్దాలుగా హక్కుపత్రాల కోసం నిరీక్షిస్తున్న వారి ఆశలు త్వరలో నెరవేరబోతున్నాయి.

Published : 04 Feb 2023 04:37 IST

పోడు పట్టాల పరిశీలనకు ఇటీవల సమావేశమైన జిల్లాస్థాయి అటవీ హక్కుల కమిటీ

ఈటీవీ, ఖమ్మం: అటవీ భూమిని సాగుచేసుకుంటూ.. దశాబ్దాలుగా హక్కుపత్రాల కోసం నిరీక్షిస్తున్న వారి ఆశలు త్వరలో నెరవేరబోతున్నాయి. అర్హులకు ఈనెలలో పోడు పట్టాలు జారీ చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దరఖాస్తులపై గ్రామ, సబ్‌ డివిజన్‌ స్థాయి కమిటీల సమావేశాలు నిర్వహించి అర్హుల జాబితాను రూపొందించింది. లబ్ధిదారుల ఎంపికపై జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. దరఖాస్తులను మరోసారి పరిశీలించి అర్హమైన వాటికి ఆమోదముద్ర వేయాలంటూ తాజాగా ప్రభుత్వం ఆదేశించటంతో మరింత మందికి పోడు పట్టాలు అందే అవకాశం కనిపిస్తోంది.

ఉభయ జిల్లాల్లో..

పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2021లో దరఖాస్తులు స్వీకరించింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 43,193 ఎకరాల్లో హక్కుపత్రాల కోసం 18,487 దరఖాస్తులు అందాయి. భద్రాద్రి జిల్లాలో 82,621 మంది 2,99,478 ఎకరాల్లో హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో దరఖాస్తులకు సంబంధించిన సర్వేను అధికారులు 2022లో ముగించారు. 2005 డిసెంబర్‌ 13కు ముందు పోడు చేసినవారి దరఖాస్తులను పోర్టల్‌ ద్వారా ఎంపిక చేశారు. ఆ దరఖాస్తులపై తొలుత గ్రామసభల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. అనంతరం సబ్‌ డివిజన్‌ స్థాయిలో పరిశీలించారు. ఆమోదం పొందిన వాటిని జిల్లాస్థాయి అటవీ హక్కుల కమిటీకి పంపించారు.

ఇప్పటివరకు లెక్క ఇలా..

ఖమ్మం జిల్లాలో 12 వేల దరఖాస్తులకు సంబంధించి 20వేల ఎకరాల్లో దరఖాస్తుల పరిశీలన కొలిక్కివచ్చింది. వీటిలో ఇప్పటివరకు జిల్లా స్థాయిలో పరిశీలించిన దరఖాస్తులన్నింటికీ హక్కుపత్రాలు అందడం ఖాయమని తెలుస్తోంది. మిగిలిన దరఖాస్తుల పరిశీలన డివిజన్‌ స్థాయి కమిటీల పరిధిలో ఉంది. తర్వాత జిల్లా కమిటీలకు ప్రక్రియ చేరనుంది. భద్రాద్రి జిల్లాలో 1,23,429 ఎకరాలకు సంబంధించి 43,520 మంది దరఖాస్తులను జిల్లాస్థాయి కమిటీ పరిశీలిస్తోంది. వీరందరికీ దాదాపు హక్కు పత్రాలు ఖాయమని తెలిసింది. మిగిలిన దరఖాస్తులను డివిజన్‌, జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీలు పరిశీలించాల్సి ఉంది.

మళ్లీ పరిశీలించాలని ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల సంఖ్య తక్కువగా ఉండటంతో మరోసారి పోడు సర్వే చేపట్టి అర్హమైన దరఖాస్తులు గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉభయ జిల్లాల్లో తిరస్కరణకు గురైన పోడు దరఖాస్తుల్ని కమిటీలు పరిశీలించే అవకాశం ఉంది. ఇంకోసారి సర్వే చేపట్టి అర్హులను అధికారులు గుర్తించనున్నారు. ఈ ప్రక్రియను కొద్దిరోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. పోడు హక్కు పత్రాలు అందిన తర్వాత సాగుదారులంతా ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు