logo

ఆనకట్ట పనులు చకచకా..

గోదావరిపై ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. ఆనకట్ట పనులు 35 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.

Updated : 04 Feb 2023 05:42 IST

అశ్వాపురం, న్యూస్‌టుడే

అమ్మగారిపల్లిలోని 2.5 బేస్‌ క్యాంప్‌లో కొనసాగుతోన్న సీతమ్మ సాగర్‌ ఆనకట్ట గేట్ల తయారీ ప్రక్రియ

గోదావరిపై ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేేగం పెరిగింది. ఆనకట్ట పనులు 35 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పియర్ల నిర్మాణం దాదాపు గేట్లను బిగించే దశకు చేరుకుంటోంది. ఈ నెలాఖరులోగా ఓ గేటును బిగించాలనే పట్టుదలతో అధికారులున్నారు. జనవరి నుంచే దుమ్ముగూడెం ఆనకట్టపై నుంచి గోదావరి ప్రవాహం పొంగి పొర్లటం నిలిచిపోయింది. ఇది కలిసిరావటంతో గేట్ల ఏర్పాటు, అనుబంధ హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది.

పరిశీలనలోనే హైడల్‌ ప్రాజెక్టు

సీతమ్మ సాగర్‌ మొత్తం 6 బ్లాకులు కాగా ప్రస్తుతం 1 నుంచి 4 బ్లాకుల్లోనే ఆనకట్ట నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వాటి తరవాత.. 5, 6 బ్లాకులకు ముందుభాగంలో 327 మెగావాట్ల హైడల్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపడతారు. అయితే ఇదింకా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలోనే ఉంది. సర్కారు ఆమోదం తెలపాల్సి ఉంది.

నాలుగు నెలల వ్యవధిలో..

సీతమ్మ సాగర్‌ అనుబంధంగా హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణ పనులు కూడా గాడినపడ్డాయి. అధికారిక పర్యవేక్షణ కొనసాగుతున్నా దాదాపు ఆనకట్ట, హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణ బాధ్యతలను పూర్తిగా గుత్తేదారు కంపెనీకి అప్పగించినట్లు కనిపిస్తోంది. నాలుగు నెలల కాలంలో సాధ్యమైనంత మేర పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

గోదావరిలో కొనసాగుతున్న సీతమ్మ సాగర్‌ ఆనకట్ట నిర్మాణ పనులు

ఎన్ని గేట్లు? ఎక్కడ తయారీ?

సీతమ్మ సాగర్‌ ఆనకట్టలో మొత్తం 68 గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 55 గేట్ల నిర్మాణం పూర్తయింది. మరో 13 పురోగతిలో ఉన్నాయి. వీటిని అమ్మగారిపల్లి వద్ద ఉన్న 2.5 బేస్‌ క్యాంప్‌లో తయారు చేస్తున్నారు.

ఏర్పాటుకు ఎన్ని రోజులు?

ఒక గేటు బిగించడానికి దాదాపుగా మూడు రోజులు పడుతుందని అధికారుల అంచనా. నెలకు ఆరు చొప్పున అమర్చే అవకాశం ఉంది. వర్షాకాలం ప్రారంభం జూన్‌ వరకు నాలుగు నెలల సమయం ఉండటంతో దాదాపు 25 గేట్ల వరకు బిగించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మరిన్ని భారీ యంత్రాలు ఇక్కడకు రానున్నాయి. తొలి గేటు ఏర్పాటుకు దాదాపు 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత వాటికి అంత సమయం పట్టదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని