logo

ఖమ్మం మదిలో కళా తపస్వి

తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, కళా తపస్వి కె.విశ్వనాథ్‌కు పూర్వ ఖమ్మం జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఖమ్మం నగరానికి ఆయన మూడుసార్లు వచ్చారు.

Published : 04 Feb 2023 04:37 IST

పలుమార్లు ఘన సత్కారం అందుకున్న కె.విశ్వనాథ్‌
ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే

2018లో భక్తరామదాసు కళాక్షేత్రంలో విశ్వనాథ్‌కు సన్మానం

తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, కళా తపస్వి కె.విశ్వనాథ్‌కు పూర్వ ఖమ్మం జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఖమ్మం నగరానికి ఆయన మూడుసార్లు వచ్చారు.
బీ తొలిసారి 2002, మార్చిలో ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో చిల్ట్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటి సొసైటీ అధ్యక్షుడు బెల్లంకొండ బాబాజీ, సలహాదారు వనం కృష్ణవేణి, ప్రస్తుత ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గౌరవాధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, సినీ, టెలివిజన్‌ రంగ కళాకారుడు జేఎల్‌.శ్రీనివాస్‌, సినీ నటుడు శ్రీనివాస్‌రెడ్డి, నాటి ఎస్పీ శ్రీనివాస్‌ శాలువా జ్ఞాపికలందజేసి సత్కారం చేశారు.

* 2016లో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విశ్వనాథ్‌ రెండు రోజులపాటు బస చేశారు. బ్రహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయణ్ని సన్మానించారు.

* దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చిన తర్వాత 2018, మార్చిలో మరోసారి నగరానికి వచ్చారు. భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో స్వర్ణ కంకణాన్ని బహూకరించారు.

ఖమ్మం బుర్హాన్‌పురం, సాంస్కృతికం, న్యూస్‌టుడే: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మృతిపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.

* విశ్వనాథ్‌ మృతికి ఖమ్మం కళాపరిషత్‌ అధ్యక్ష, కార్యదర్శులు వీవీ.అప్పారావు, నాగబత్తిని రవి, రచయిత అట్లూరి వెంకటరమణ, శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయం అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, పర్యావరణవేత్త కడవెండి వేణుగోపాల్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఎందరికో స్ఫూర్తి

* కూచిపూడి నృత్య కళాకారిణి ఏలూరి మీనా చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మొదటి బహుమతి సాధించి విశ్వనాథ్‌ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. విజయవాడ లయోలా కళాశాలలోనూ ఆయన చేతుల మీదుగా బహుమతి అందుకోవటం విశేషం.
* నగరానికి చెందిన విశ్రాంత అర్థశాస్త్ర ఆచార్యురాలు కాల్వల పద్మజ 2022, డిసెంబరులో తాను రాసిన పుస్తకంతోపాటు జ్ఞాపికను అందజేసి సత్కరించారు.


‘‘తెలుగు సినీ చరిత్రను సంగీత ప్రధాన చిత్రాల వైపు మళ్లించిన వ్యక్తి విశ్వనాథ్‌. దేశం ఉన్నంతవరకు భారతం రాసిన వ్యాసుణ్ని ఎలా తలుచుకుంటామో.. తెలుగు సినిమా ఉన్నంతకాలం కళామతల్లి కంఠాభరణమైన శంకరాభరణం చిత్రకర్త గుర్తుండిపోతారు. సంగీత సాహిత్యానికి పెద్దపీట వేసిన ఆయన చిత్రాలు, పాటలు, మాటలు కొత్తతరం దర్శకులకు మార్గదర్శకాలు.’’

కమల్‌, వర్ధమాన రచయిత.


మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు

విశ్వనాథ్‌తో వర్ధమాన దర్శకుడు మాదల వేణు

మధిర పట్టణం, న్యూస్‌టుడే: మాటూరుపేట రామాలయ కల్యాణ వేడుక కోసం నాలుగేళ్ల క్రితం గ్రామవాసి, వర్ధమాన సినీ దర్శకుడు మాదల వేణు పదిగ్రాముల బంగారు మంగళసూత్రాన్ని బహూకరించారు. తొలుత ఆ సూత్రానికి దర్శక దిగ్గజం డా.కె.విశ్వనాథ్‌ చేతుల మీదుగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పూజ చేయించారు. సీతావలోకనం సినిమా హీరోయిన్‌ మధుశాలినీతో పాటు మాదల వేణు, సినీ నిర్మాత నెక్కంటి ప్రియాంక ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు.


భద్రాచలంతో బంధం

భద్రాచలంలో దర్శక దిగ్గజంతో అల్లం

భద్రాచలం, న్యూస్‌టుడే: కె.విశ్వనాథ్‌ దాదాపు రెండు దశాబ్దాల క్రితం సతీ సమేతంగా భద్రాచలం వచ్చారు. భద్రాద్రి కళాభారతి నిర్వాహకులు అల్లం నాగేశ్వరరావు ఆయనకు సన్మానం చేశారు. ఆ రోజున కె.విశ్వనాథ్‌ చేసిన ప్రసంగం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

* 2005లో సాయికుమార్‌ హీరోగా నటించిన శ్లోకం చిత్రంలో విశ్వనాథ్‌ కీలక పాత్ర పోషించారు. భద్రాచలం- బూర్గంపాడు మండలాల్లో దీన్ని చిత్రీకరించారు. గోదావరి వద్ద ప్రత్యేక కుటీరాన్ని సెట్‌గా ఏర్పాటు చేసి ముఖ్య ఘట్టాలను తెరకెక్కించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని