logo

నేర వార్తలు

కూలీ పనులకు వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. భార్య క్యాన్సర్‌తో పోరాడుతోంది. భర్త అనారోగ్యం బారిన పడ్డారు.

Updated : 04 Feb 2023 06:12 IST

భారం కావొద్దని.. దంపతుల ఆత్మహత్యాయత్నం

భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

లచ్చయ్య

కామేపల్లి, న్యూస్‌టుడే: కూలీ పనులకు వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. భార్య క్యాన్సర్‌తో పోరాడుతోంది. భర్త అనారోగ్యం బారిన పడ్డారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ తాము ఎవరికీ భారం కావొద్దని పురుగుమందు తాగారు. వారిలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కామేపల్లి మండలం మద్దులపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కొమ్మినబోయిన లచ్చయ్య, పద్మ దంపతులు వ్యవసాయ కూలీలు. కుమారుడు, కూతురు సంతానం. వారికి పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు తమకున్న ఎకరం భూమిలో పంటలు సాగు చేస్తూ వేరుగా జీవిస్తున్నాడు. కొంతకాలం నుంచి పద్మ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. లచ్చయ్య కూడా అనారోగ్య సమస్యల బారినపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనస్తాపం చెంది టానిక్‌ సీసాలో పురుగు మందు కలుపుకొని తాగి పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లచ్చయ్య (52) మృతి చెందారు. పద్మ చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుమారుడు వీరబాబు ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు.


ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్య కార్యకర్త బలవన్మరణం

పొట్టా మధు

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్య కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజేశ్‌కుమార్‌ కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం తోగ్గూడేనికి చెందిన పొట్టా మధు(40) దమ్మపేట పీహెచ్‌సీలో 12 ఏళ్లుగా కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్త(ఎంపీహెచ్‌ఏ)గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలున్నారు. తక్కువ వేతనం రావడంతోపాటు, అవీ నెలనెలా అందకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆ మనస్తాపంతో మధు గురువారం రాత్రి తోగ్గూడెంలోని ఇంట్లో నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం కుటుంబీకులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై కేసు నమోదు చేసిన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. బీ మధు కుటుంబాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్‌ శిరీష శుక్రవారం పరామర్శించారు. పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని పరిశీలించారు. కాంట్రాక్టు ఉద్యోగుల జిల్లా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో రూ.10 వేలు బాధిత కుటుంబానికి అందించారు.


బస్సు ఢీకొని యువకుడి మృతి

బాణోతు నరేశ్‌

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కామేపల్లి మండలం గోపాలపురానికి చెందిన బాణోతు నరేశ్‌(27) నగరంలోని ఓ ప్రయివేటు పురుగు మందుల సంస్థలో పనిచేస్తున్నారు. తన బైక్‌పై ఖమ్మం వస్తుండగా మంచుకొండ గ్రామ కూడలిలో ఎదురుగా ఇల్లెందు వెళ్తున్న బస్సు ఢీకొంది. రహదారిపై పడిన అతనిపై నుంచి బస్సు వెళ్లడంతో తల, ఛాతీ నలిగిపోయాయి. నరేశ్‌ అక్కడికక్కమే మృతి చెందారు.

భార్య నాలుగు నెలల గర్భిణి: నరేశ్‌ ఏబీవీపీలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా సేవలందించారు. ఖమ్మం జిల్లాతోపాటు, ఆదిలాబాద్‌ జిల్లా బాధ్యునిగానూ వ్యవహరించారు. ప్రస్తుతం భాజపాలో మండల కీలక సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్య రమ్య నాలుగు నెలల గర్భిణి. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.


రైతులను మోసగించిన వ్యాపారుల అరెస్టు

కూసుమంచి, న్యూస్‌టుడే: రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి డబ్బుచెల్లించకుండా ఉడాయించిన మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్‌కు చెందిన మాధవ్‌, సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన కిరణ్‌ను అరెస్టు చేసినట్లు కూసుమంచి ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపారు. నాందేడ్‌కు చెందిన మాధవ్‌ కొన్నేళ్ల క్రితం గుంటూరు వచ్చి మార్కెట్లో పనులు చేస్తూ.. కోదాడ ప్రాంత రైతులతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత కోదాడ వచ్చి పత్తి, ధాన్యం, మిరప కొనుగోలు చేస్తూ అదే ప్రాంతంలోని చిలుకూరుకు చెందిన బల్సుపాటి కిరణ్‌ ఇంటి వద్ద ఉంటూ అతనితో కలిసి వ్యాపారం చేశాడు. తన వ్యాపారాన్ని కూసుమంచి ప్రాంతానికి విస్తరించాడు. ఈఏడాది ముత్యాలగూడెం రైతుల వద్ద సరకు కొనుగోలు చేసి డబ్బు చెల్లించి నమ్మకం కలిగించాడు. అనంతరం కిష్టాపురం, పోచారం, చౌటపల్లి రైతుల నుంచి రూ.18 లక్షల పత్తి, మిర్చి, ధాన్యం కొనుగోలు చేశారు. సరకు తీసుకెళ్లి డబ్బు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతుండటంతో రైతులు వారిపై నిఘా ఉంచి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిద్దరు ఖమ్మం గ్రామీణం మండలం నర్సింహాపురం ప్రాంతంలోనూ, గార్ల, బయ్యారం ప్రాంతంలోనూ రైతులను మోసగించినట్టు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు