logo

చదువులమ్మ చెట్టు నీడలో.. జ్ఞాపకాల దొంతరలు

ఆరు దశాబ్దాల నుంచి విద్యనభ్యసించిన వారంతా చదువులమ్మ చెట్టు నీడలో చేరాయి. జ్ఞాపకాల దొంతరలు వారిని కమ్మివేశాయి. తరగతి గదుల్లో నేర్చుకున్న విజ్ఞాన సౌరభాలు మరోమారు సుగంధాలు వెదజల్లాయి.

Published : 05 Feb 2023 02:10 IST

ప్రిన్సిపల్‌ రాజశేఖర్‌రెడ్డికి రూ.లక్ష అందజేస్తున్న ‘1989’ బ్యాచ్‌ విద్యార్థులు

కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆరు దశాబ్దాల నుంచి విద్యనభ్యసించిన వారంతా చదువులమ్మ చెట్టు నీడలో చేరాయి. జ్ఞాపకాల దొంతరలు వారిని కమ్మివేశాయి. తరగతి గదుల్లో నేర్చుకున్న విజ్ఞాన సౌరభాలు మరోమారు సుగంధాలు వెదజల్లాయి. కలిసి ఆడుకున్న దృశ్యాలు కళ్లెదుటే పరుగెత్తాయి. గురువులతో పెనవేసుకున్న ఆనాటి అనుబంధాలు హత్తుకుపోయాయి. మొత్తానికి.. వొడవని ముచ్చట్లతో ఆ విద్యాలయం రోజంతా పులకించిపోయింది. కొత్తగూడెం రుద్రంపూర్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌లో వజ్రోత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండ్రోజుల వేడుకలో భాగంగా తొలిరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. దేశ విదేశాల్లో స్థిరపడిన వారితోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి ‘1963-2022’ బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు వెయ్యి మందికి పైగా తరలిరావడం విశేషం. అందరూ కుటుంబ సమేతంగా రావడంతో సందడి నెలకొంది. బ్యాచ్‌ల వారీగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. వేడుక జ్ఞాపకాలను సెల్ఫీల్లో బంధించుకున్నారు. అలనాటి గురువులకు జ్ఞాపికలు అందజేసి ఘన సత్కారాలు చేశారు. ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి వితరణలు ప్రకటించారు. ప్రిన్సిపల్‌ రాజశేఖర్‌రెడ్డికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. నేడు వార్షికోత్సవానికి కలెక్టర్‌ అనుదీప్‌తో పాటు సింగరేణి ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

వేడుకకు హాజరైన పూర్వ విద్యార్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని