logo

దొంగ హల్‌సెల్‌..

ఖరీదైన సెల్‌ఫోన్‌ తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరవుతున్నారా..? లేదా సభలకు వెళ్తున్నారా..? కాస్త ఆలోచించుకోండి.. మీ సెల్‌ఫోన్‌ ఎప్పుడైనా మాయం కావొచ్చు.

Published : 05 Feb 2023 02:10 IST

ఖరీదైన సెల్‌ఫోన్‌ తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరవుతున్నారా..? లేదా సభలకు వెళ్తున్నారా..? కాస్త ఆలోచించుకోండి.. మీ సెల్‌ఫోన్‌ ఎప్పుడైనా మాయం కావొచ్చు.


సభలో అభిమాన నాయకుడు ప్రసంగిస్తున్నాడనో.. శుభకార్యాల్లో అలంకరణలు బాగున్నాయని తదేకంగా చూస్తూ ఉండిపోయారో.. జేబులోని సెల్‌ఫోన్‌ అపహరణకు గురికావొచ్చు.


రూ.50వేలు అంతకుమించి విలువ చేసే సెల్‌ఫోన్‌ అయినా రూ.5వేలు, రూ.3వేలకు ఇతరులకు అమ్మేస్తాడు. కుదిరితే రూ.2వేలకే ఇచ్చేస్తాడు. ఈ ఘరానాదొంగ తస్కరించిన సెల్‌ఫోన్లనే అతడి స్వగ్రామంలో 60 శాతం మంది వినియోగిస్తుండటం గమనార్హం.


చూడటానికి అమాయకుడిలా కనిపిస్తాడు.. ఆలయాలు, శుభకార్యాలు, సభలకు హాజరయ్యేవారిని లక్ష్యంగా చేసుకుంటాడు.

మాటల్లో మునిగిన వ్యక్తుల జేబుల్లోంచి సెల్‌ఫోన్లను చాకచక్యంగా తస్కరిస్తూ సెకన్ల వ్యవధిలో జారుకుంటాడు.. వెంటనే వాటిలోంచి సిమ్‌లను మాయం చేస్తాడు.. కొన్ని గంటల వ్యవధిలోనే ఫోన్లను విక్రయించి మద్యం తాగి తిరుగుతుంటాడు.. ఎవరైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే నోటికొచ్చినట్లు దుర్భాషలాడతాడు.. పది రోజుల వ్యవధిలో మధిర నియోజకవర్గంలో ఖరీదైన పది సెల్‌ఫోన్లు కాజేశాడు వైరా మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇదే గ్రామంలో పేరుగాంచిన ఓ గుట్కా వ్యాపారి అతడికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


నవరి 27న మధిరలోని చెరుకుమల్లి వారి వీధిలో రాధాకృష్ణుల విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు జరిగాయి. ఇద్దరి భక్తుల సెల్‌ఫోన్లను చోరీ చేసి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. పోగొట్టుకున్న ఫోన్‌ ఎక్కడ ఉందో సాంకేతికత సహాయంతో ఓ యువకుడు ట్రాక్‌ చేస్తూ వెంబడించారు. తీరా ఘరానాదొంగ ఇంటికి చేరుకున్నారు. తస్కరించిన సెల్‌ఫోన్‌ను ఇవ్వాలని వేడుకున్నారు. మద్యం మత్తులో ఉన్న దొంగ నానా దుర్భాషలాడాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికి వచ్చి రూ.5వేలు ఇస్తానని, ఫోన్‌ విక్రయించాలని అడగ్గా వెంటనే ఇంట్లోంచి తెచ్చి చేతిలో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మరో భక్తుడు ఆ గ్రామానికి వెళ్లి అదే పెద్దమనిషితో మాట్లాడి సెల్‌ఫోన్‌ తెచ్చుకున్నారు. ఈ ఫోన్లలోని సిమ్‌లు మాయం చేసి రెండు గంటల వ్యవధిలోనే వాటిలో సాఫ్ట్‌వేర్‌ మొత్తాన్ని తొలగించటం విశేషం. బోనకల్లులో ఇటీవల జరిగిన ఓ సభలోనూ ఇదే మాదిరిగా పది సెల్‌ఫోన్లను దొంగ తస్కరించాడు. కొంతమంది జేబులను ఖాళీ చేశాడు. ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఓ పోలీస్‌ అధికారి సెల్‌ఫోన్‌ను సైతం ఇటీవల చోరీ చేశాడు. సదరు అధికారి తమ సిబ్బందిని పంపించి అతడికి రూ.5వేలు చెల్లించి సెల్‌ఫోన్‌ను స్వాధీనపరచుకోవటం గమనార్హం. దొంగ ఆగడాలపై ‘న్యూస్‌టుడే’ ఫోన్‌లో సంప్రదించినా స్థానిక పోలీసులు స్పందించలేదు.

మధిర, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని