logo

మెనూ... పెట్టిందే తిను..!

జూలూరుపాడు మండలం పడమటినర్సాపురంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు 489 మంది విద్యనభ్యసిస్తున్నారు.

Published : 05 Feb 2023 02:10 IST

ఆశ్రమ విద్యాలయాలు, వసతిగృహాల నిర్వాహకుల తీరిది
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే

ఇటీవల స్థానిక హైవేపై ఆందోళనకు దిగిన పాల్వంచ బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

జూలూరుపాడు మండలం పడమటినర్సాపురంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు 489 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉడికీ ఉడకని ఆహారం తినడంతో రెణ్నెల్ల క్రితం 29 మంది బాలికలు అనారోగ్యం పాలయ్యారు. ఐటీడీఏ పీఓ గౌతమ్‌ పోట్రు, ఇతర అధికారులు స్వయంగా వెళ్లి విచారణ జరిపారు.


పాల్వంచ పట్టణంలోని గిరిజన బాలుర ఉన్నత పాఠశాలలో 511 మంది చదువుకుంటున్నారు. మెనూ పాటించడం లేదని గతనెల 4న విద్యార్థులు జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ‘మేం అడిగేది మెనూ అమలు మాత్రమే’ అంటూ నినాదాలు చేశారు.  


వెనుకబడిన తరగతుల పిల్లల చదువుకునే వసతి గృహాల్లో ఆహార నాణ్యత సక్రమంగా పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. తరచూ ఏదో ఒకచోట విద్యార్థులు అస్వస్థత పాలవడం, లేదా మెనూపై ఆందోళనకు దిగడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సరైన పోషకాహారం లభిస్తేనే బాలలు చక్కగా ఎదుగుతారు. చదువుపై దృష్టిపెడతారు. ఈ కోణంలో ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేస్తోంది. పౌష్టికాహారంతో కూడిన మెనూ పారదర్శకంగా అమలు చేయాలని సూచిస్తోంది. కానీ భద్రాచలం ఐటీడీఏ పరిధిలో కొనసాగుతున్న కొన్ని ఆశ్రమ పాఠశాలలు, ప్రీ, పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో ఉన్నతాధికారుల ఆదేశాలు పెడచెవిన పెడుతున్నారు. నాణ్యత లేని బియ్యంతో, పెద్దగా రుచిలేని భోజనాలు వండిపెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం, షోకాజు నోటీసుల జారీతో అధికారులు సరిపెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ముక్కిపోయి, పురుగుపట్టినవి కాకుండా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని, సకాలంలో సరకుల బిల్లులు మంజూరు చేయడం ద్వారా మెరుగైన మెనూ అమలయ్యేలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టాలని బాలలు కోరుతున్నారు.

షోకాజ్‌ నోటీసుల పరంపర

పాల్వంచ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టిన ఘటనపై నివేదిక ఆలస్యమైందన్న కారణంతో దమ్మపేట ఏటీడీఓ చంద్రమోహన్‌కు.. మెనూ అమలు చేయనందుకు హెచ్‌ఎం, డిప్యూటీ వార్డెన్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీఅయ్యాయి. బాలికలు అస్వస్థతకు గురయ్యారని పడమటినర్సాపురం ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం, వార్డెన్‌కు.. నిబంధనలకు విరుద్ధంగా విందులు జరుపుకొన్నారన్న కారణాలతో మణుగూరు పరిధిలోని ఎల్చిరెడ్డిపల్లి, ఇల్లెందు పట్టణ బాలికలు, భద్రాచలం బాలుర ఆశ్రమ పాఠశాలల ఏటీడీఓలు, హెచ్‌ఎంలు, వార్డెన్లకు షోకాజులు ఇచ్చారు. ఎల్చిరెడ్డిపల్లి ఘటనలో హెచ్‌ఎం, డిప్యూటీ వార్డెన్‌పై సస్పెన్షన్‌ విధించారు. ఘటన జరిగినప్పుడే నిర్వాహకులను భయపెట్టకుండా, సాధారణ రోజుల్లో స్థానిక అధికారులతోనూ పర్యవేక్షణ కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఐటీడీఏ ఉన్నతాధికారులను కోరుతున్నారు.


‘ఐటీడీఏ పరంగా వసతి గృహాలు, ఆశ్రమ విద్యాలయాల్లో లోటుపాట్లు లేకుండా పర్యవేక్షిస్తున్నాం. మెనూ అమలుపై తనిఖీలు చేస్తున్నాం. లోపాలున్న చోట నిర్వాహకులపై పీఓ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. బాధ్యుల వివరణలనూ పరిగణనలోకి తీసుకుంటున్నాం. నిర్వహణ, మెనూ అమలు మరింత మెరుగయ్యేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాం’.

రమాదేవి, ఐటీడీఏ ఉప సంచాలకురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని