logo

పైసలు కేటాయిస్తేనే ప్రాజెక్టులు మున్ముందుకు..

రాష్ట్ర బడ్జెట్‌పై ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే పనులు జోరందుకుంటాయని ఆశిస్తున్నారు. బడ్జెట్‌ను ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.

Published : 05 Feb 2023 02:11 IST

ఈటీవీ, ఖమ్మం

రాష్ట్ర బడ్జెట్‌పై ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే పనులు జోరందుకుంటాయని ఆశిస్తున్నారు. బడ్జెట్‌ను ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.


‘సీతారామ’ పనులు 60 శాతం పూర్తి

ఉభయ జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ.13,263 కోట్ల అంచనాతో పనులు చేపట్టింది. ఇప్పటివరకు సుమారు రూ.8 వేల కోట్లు వెచ్చించింది. ప్రాజెక్టు పనులు 60 శాతం పూర్తయ్యాయి. గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులు రూ.కోట్ల మేర పేరుకుపోయాయి. ప్రాజెక్టులో భాగంగా జూలూరుపాడు నుంచి ఏన్కూరు వరకు 13 అదనపు ప్యాకేజీ పనులు చేపట్టాల్సి ఉంది. రూ.300 కోట్లతో ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. పాలేరు ప్రధాన లింకు కెనాల్‌ను కలిపేలా పనులు చేపట్టనున్నారు. ఇల్లెందు నియోజకవర్గం, కారేపల్లి మండలానికి సీతారామ ప్రాజెక్టును అనుసంధానం చేసేలా రూ.2,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడు ఎత్తిపోతలు నిర్మించి సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని భావిస్తున్నారు.


సీతమ్మ సాగర్‌కు రూ.5500 కోట్లు అవసరం

గోదావరి నీటిని ఒడిసిపట్టేలా 37 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో సీతమ్మ సాగర్‌ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ఇక్కడే 327 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రం ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మొత్తమ్మీద రూ.5,500 కోట్లు అవసరం.

* రాష్ట్రంలో పామాయిల్‌ సాగు విస్తీర్ణం పెంచేందుకు గత బడ్జెట్‌లో రూ.1,000 కోట్లను ప్రభుత్వం కేటాయించినా నిధులు విడుదల చేయలేదు.

* ఉభయ జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ వసతిగృహాలు చాలావరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అన్ని వసతులతో కూడిన సొంత భవనాలు కావాలని విద్యార్థులు కోరుతున్నారు.

* వైరా, లంకసాగర్‌, జాలిమూడి, పెద్దవాగు, తాలిపేరు ప్రాజెక్టుల వార్షిక మరమ్మతులకు మూడేళ్లుగా బడ్జెట్లలో కేటాయింపులుంటున్నా నిధులు విడుదలవటం లేదు. ఫలితంగా ప్రాజెక్టుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.


హామీలు నెరవేరేనా..?

* భద్రాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధిని గాలికొదిలేసిందంటూ రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. భద్రాచలం రామాలయ అభివృద్ధికి గత రెండు బడ్జెట్లలో కలిపి రూ.150 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు ఏమాత్రం విడుదల చేయలేదు. గోదావరికి రెండువైపులా కరకట్టల నిర్మాణానికి సుమారు రూ.2 వేల కోట్లతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. గత జులైలో భారీ వరదల పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరకట్టలు నిర్మిస్తామని చెప్పారు. భద్రాచలం పట్టణంలోని వివిధ కాలనీల వాసులకు 2,106 పక్కా గృహాలు కట్టిస్తామన్నారు.

* ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల జరిగిన భారాస ఆవిర్భావ సభలో హామీ ఇచ్చారు. నూతన వైద్య కళాశాలకు ఇప్పటికే రూ.166 కోట్లు కేటాయించినా మరమ్మతులు, భవనాల నిర్మాణాలకు మరిన్ని నిధులు అవసరం.

* ఖమ్మం- ఇల్లెందు, తల్లాడ- కొత్తగూడెం, వైరా- మధిర, ఖమ్మం- బోనకల్లు రహదారులపై రద్దీ పెరిగింది. చాలాచోట్ల రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. కొత్తగూడెం జిల్లా కేంద్రం, భద్రాచలంలో ఆర్టీసీ బస్టాండ్లను ఆధునికీకరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని