logo

కలిసిమెరిసి..

ఉద్యోగం, కుటుంబ బాధ్యతలతో నిత్యం తలమునకలయ్యే మహిళలకు విహారయాత్రలు ఊరట కలిగిస్తున్నాయి. ఖమ్మం నగరంలోని కొంతమంది అతివలు బృందాలుగా ఏర్పడి ఎంచక్కా పర్యాటక ప్రదేశాలను చుట్టేసి వస్తున్నారు.

Published : 05 Feb 2023 02:19 IST

ఖమ్మం బల్లేపల్లి, న్యూస్‌టుడే

దుబాయ్‌ విహారయాత్రలో అతివల ఉల్లాసం

ఉద్యోగం, కుటుంబ బాధ్యతలతో నిత్యం తలమునకలయ్యే మహిళలకు విహారయాత్రలు ఊరట కలిగిస్తున్నాయి. ఖమ్మం నగరంలోని కొంతమంది అతివలు బృందాలుగా ఏర్పడి ఎంచక్కా పర్యాటక ప్రదేశాలను చుట్టేసి వస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా స్వీయవిశ్వాసంతో భారతదేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. నేపాల్‌, సింగపూర్‌, దుబాయ్‌ ప్రాంతాలకు సైతం వెళుతున్నారు. కలిసికట్టుగా ప్రయాణిస్తూ ఆనందాన్ని పొందుతున్నారు.

బాధ్యతలతో సాగిపోయే జీవితంలో పిల్లలు పెద్దయ్యాక అతివలు తమ కోసం సమయం కేటాయిస్తున్నారు. అందుకు కుటుంబ సభ్యులు సైతం ప్రోత్సాహం అందిస్తున్నారు. మహిళలు బృందాలుగా ఏర్పడి ప్రయాణ తేదీలను నెలరోజుల ముందే ఖరారు చేసుకుంటున్నారు. విమాన, రైలు ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవటానికి ఆర్థిక గణాంకాలతో యాత్ర ఖర్చుల జాబితాను రూపొందించుకుంటున్నారు.

బుద్ధగయను సందర్శించిన మహిళలు


ప్రకృతిని ఆస్వాదిస్తూ.. చరిత్రను తెలుసుకుంటూ..

ఎవరూ నొచ్చుకోకుండా ఖర్చులను బేరీజు వేసుకొని ఈ బృందాల్లోని ఒకరు యాత్ర కాలంలో నాయకత్వం వహిస్తున్నారు. ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు. పురాతన కట్టడాలు, ప్రసిద్ధ స్థలాలను సందర్శిస్తూ చరిత్రను తెలుసుకుంటున్నారు. కొన్ని కోలాటబృందాల సభ్యులు భక్తిభావంతో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించి తరిస్తున్నారు. భిన్న సంస్కృతులను తిలకిస్తూ ఉత్తేజాన్ని పొందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆరోగ్యకర ఆహారం రుచి చూసి స్వస్థలానికి చేరుకున్న తర్వాత ప్రయోగాలు చేస్తున్నారు. రోజువారీ విధులకు ఆటంకం కలగకుండా పండగ, వేసవి సెలవుల్లో వనితా విహారం సాగుతోంది.

విహార యాత్రలో క్రేజీ కిట్టీ పార్టీ బృందం


దేశ, విదేశాల్లో విహారం
-గోళ్ల సౌభాగ్య, ఉపాధ్యాయురాలు, ఖమ్మం

22 ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాలను మా స్నేహితులతో కలిసి సందర్శిస్తున్నాను. మా బృందంలో ఎనిమిది మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉపాధ్యాయినులు, మరో ఇద్దరు గృహిణులు ఉన్నారు. కశ్మీర్‌, గోవా, దుబాయ్‌ లాంటి ప్రాంతాల్లో విహరించాం. మహిళలు కలిసికట్టుగా ప్రయాణించటం వల్ల రక్షణ ఉంటుంది.


ఉల్లాసం నింపే ప్రయాణం
-పోటు రజిత, గృహిణి,  ఖమ్మం

ఆరేళ్ల నుంచి మా కోలాటబృందం వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించింది. తితిదే దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా దేశంలోని వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తున్నాం. శ్రీశైలం, తిరుపతి, అయోధ్య, బుద్ధగయ, వారణాసి, నైమి శారణ్యం, ఛార్‌దామ్‌ ప్రాంతాలను దర్శించుకున్నాం. కొత్త ప్రదేశాలు, నది ప్రయాణం ఉల్లాసాన్ని కలిగించాయి.


కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం..
-రావూరి రుక్మిణి

విహారయాత్రల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. యోగా డే, మహిళా దినోత్సవం వంటి వేడుకలను మా బృందం తరఫున పర్యాటక ప్రదేశాల్లో జరుపుకొంటాం. ఆరోగ్యం, ఆనందం, పిల్లల చదువులు, కష్టసుఖాలను పంచుకుంటాం. వంటసామగ్రితో ప్రత్యేకంగా వాహనంలో ప్రయాణం సాగిస్తాం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు, కంచి, అరుణాచల్‌ప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లొచ్చాం.


ఆటపాటలతో సరదాగా..
-అనుముల హైమావతి, ఖమ్మం

ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలు, పార్కులకు వెళ్తుంటాం. ఐదేళ్లుగా క్రేజీ కిట్టీ పార్టీ పేరిట వివిధ ప్రదేశాలను సందర్శిస్తున్నాం. పచ్చని వనాల్లో ఆటపాటలతో ఉల్లాసంగా వేడుకలు జరుపుకొంటున్నాం. సరదాగా ఆటల పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందుకుంటాం. విజయవాడకు ఒకసారి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని