logo

ఆశలు గాలికి..

దేశవ్యాప్తంగా నూతనంగా 152 విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు తాజా కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Published : 06 Feb 2023 05:48 IST

కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు సాంకేతిక చిక్కులు

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా నూతనంగా 152 విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు తాజా కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తెలంగాణలో ఎన్నింటిని నిర్మిస్తున్నారో చెప్పాలని భారాస మహబూబాబాద్‌, చేవెళ్ల, పెద్దపల్లి ఎంపీలు మాలోత్‌ కవిత, బొర్లకుంట వెంకటేశ్‌ నేత, రంజిత్‌రెడ్డిలు అడిన ప్రశ్నకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ బదులిచ్చారు. వరంగల్‌, ఆదిలాబాద్‌లలో బ్రౌన్‌ ఫీల్డ్‌, నిజామాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు త్వరలో అభివృద్ధి చేయనున్నట్లు సమాధానమిచ్చారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలో గతంలో ప్రతిపాదించిన గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం సాంకేతికంగా అసాధ్యమని తేల్చిచెప్పారు. దీంతో ‘కొత్తగూడెం విమానాశ్రయం’ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
రాష్ట్రంలోని వరంగల్‌, ఆదిలాబాద్‌, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)కు గతంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రతిపాదిత ప్రాంతాల్లో ‘గరిష్ఠ వరదల స్థాయి’ నివేదిక కోరుతూ ఏఏఐ అధికారులు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ సీఈకి 2020లో లేఖ రాశారు. సీఈ ఆదేశాలతో ఆయా జిల్లాల ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు నివేదికలు అందజేశారు. అన్నిచోట్ల సానుకూల పరిస్థితులున్నట్లు పేర్కొన్నారు. నివేదికల ఆధారంగా కొన్నాళ్లకు ఏఏఐ బృందం వచ్చి క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. బృందం నివేదిక ఆధారంగా తాజాగా పార్లమెంటు సమావేశాల్లో సివిల్‌ ఏవియేషన్‌ మంత్రి మరింత స్పష్టత ఇచ్చారు. వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో సాంకేతికంగా ఇబ్బందుల్లేవన్నారు. అక్కడ ఎయిర్‌ పోర్టుల నిర్మాణాలకు నిర్ణీత గడువులోగా స్థల సేకరణ చేపట్టాలన్నారు. కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌కు మాత్రం సాంకేతిక గుర్తింపు లేదన్నారు.


1,600 ఎకరాలు చూపినా...

కేంద్రం 2016లో ‘ఉడాన్‌’ (ఉడో దేశ్‌కీ ఆమ్‌ నాగరిక్‌) పథకాన్ని ప్రారంభించింది. హిందీ భాషలో ‘విమానం’ అని అర్థం. విమాన ప్రయాణాన్ని సరసమైన ధరలకే అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఇప్పటికే ఉన్న ప్రాంతీయ విమానాశ్రయాలను మరింత విస్తరించడం ఈ పథకం ఉద్దేశం. కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు లక్ష్మీదేవిపల్లి మండలంలోని పునుకుడుచెలక పరిధిలోనున్న 1,600 ఎకరాలను రెవెన్యూ అధికారులు చూపారు. ఏఏఐ అధికారులు రెండేళ్ల క్రితం క్షేత్రస్థాయి సర్వే చేశారు. ఆ స్థలమంతా ‘వైల్డ్‌లైఫ్‌’ పరిధిలో ఉండటంతో ప్రత్యామ్నాయంగా పాల్వంచ పట్టణం పరిధిలోని పిల్లవాగు, గుడిపాడు సమీపంలోని సర్వే నంబరు 999లో వెయ్యి ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అప్పటి జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి పరిశీలించి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ వారికి సమాచారమిచ్చారు. ఆ సంస్థ అధికారులు కూడా పరిశీలించి వెళ్లారు. తీరా చూస్తే.. సాంకేతిక గుర్తింపు లేదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి సాంకేతిక ఆటంకాలకు పరిష్కారం చూపితే విమానాశ్రయం కల నెరవేరే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని