logo

దాతలు స్పందించండి

సత్తుపల్లి మండలంలోని పది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 500 మంది విద్యార్థులకు గంగారానికి చెందిన దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి గత డిసెంబరు 15 నుంచి ఉదయం, సాయంత్రం అల్పాహారం వితరణ చేస్తున్నారు.

Updated : 06 Feb 2023 08:32 IST

పది విద్యార్థులకు అల్పాహారం అందించండి

ఎర్రుపాలెం మండలంలోని భీమవరం ఉన్నత పాఠశాలలో దాతల సాయంతో పదో తరగతి చదివే విద్యార్థులకు ఎనిమిదేళ్లుగా సాయంత్రం వేళ అల్పాహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం 32 మంది పది విద్యార్థులున్నారు. ఈ ఏడాది అల్పాహారానికి దాతలు వై.పూర్ణచంద్రారెడ్డి, సీహెచ్‌.కిషోర్‌, ఎస్‌.కృష్ణారెడ్డి, ఎస్‌.కృష్ణారావు, ఎస్‌.జయలక్ష్మి, సత్యనారాయణరెడ్డి, ఎ.కృష్ణారావు, బహదూర్‌ఖాన్‌లు సాయం అందించారు.

ఎర్రుపాలెం, న్యూస్‌టుడే


 నామవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 20 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. దాత సంకెళ్ల పాపారావు సహకారంతో ఈ ఏడాది నుంచి అల్పాహారం సమకూరుస్తున్నారు.

చింతకాని, న్యూస్‌టుడే


సత్తుపల్లి, న్యూస్‌టుడే: సత్తుపల్లి మండలంలోని పది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 500 మంది విద్యార్థులకు గంగారానికి చెందిన దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి గత డిసెంబరు 15 నుంచి ఉదయం, సాయంత్రం అల్పాహారం వితరణ చేస్తున్నారు. ఉదయం ఇడ్లీ, గోధుమరవ్వ ఉప్మా, ఎగ్‌రైస్‌, వెజ్‌బిర్యానీ, బోండా, ఊతప్పం వంటి అల్పాహారంతోపాటు సాయంత్రం అరటి పండ్లు, బిస్కెట్లు, పల్లీ ఉండలు, శనగలు, పల్లీలు, గుగ్గీల్లు వంటి స్నాక్స్‌ సరఫరా చేస్తున్నారు.


ప్రత్యేక తరగతులు ఇలా..

విద్యాశాఖ సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి 9 నుంచి మార్చి 10 వరకు రోజుకు రెండు గంటల చొప్పున పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4.45గంటల వరకు పాఠశాల సమయం కాగా ఉదయం 8.30గంటల నుంచి 9.30గంటల వరకు ఒక సబ్జెక్టు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు మరో సబ్జెక్టును విధిగా ప్రత్యేక తరగతుల్లో బోధించాల్సి ఉంది.


మధ్యాహ్న భోజనంతో సరి

పాఠశాలలున్న గ్రామం నుంచే కాకుండా సమీప ప్రాంతాలనుంచీ విద్యార్థులు చదువుకునేందుకు వస్తుంటారు. ఇలాంటి వారు ఉదయం అల్పాహారం లేకుండానే హడావిడిగా బడికొస్తున్నారు. కేవలం మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకుని తిరిగి సాయంత్రం ప్రత్యేక తరగతులు ముగిసిన తర్వాత ఇళ్లకు చేరుకుంటున్నారు. ఆకలి కడుపులతోనే పాఠాలు వినాల్సిన దుస్థితి చాలామందికీ ఎదురవుతోంది.

మధిర పట్టణం, న్యూస్‌టుడే


వారు సర్కారు బడుల్లో అభ్యసిస్తున్న పదో తరగతి విద్యార్థులు.. నిరుపేద కుటుంబాలకు చెందిన వారైనా ప్రతిభకు కొదవలేదు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని పట్టుదలతో అభ్యసిస్తున్నారు. ఇందుకోసం అర్ధాకలితోనే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. రోజంతా మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. తరగతుల తర్వాత తిరిగి ఇంటికి వెళ్లే వరకు మధ్యలో ఎలాంటి ఆహారం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి అల్పాహారం అందించాలని కోరుతున్నారు.


సాయంలో స్ఫూర్తి దాతలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇది కార్యరూపు దాల్చకున్నా అక్కడక్కడా కొంతమంది దయార్ద హృదయంతో ముందుకు వచ్చి అల్పాహారానికి చేయూత అందిస్తున్నారు. కానీ ఉభయ జిల్లాల్లో 5శాతం పాఠశాలల్లో మాత్రమే ఇది అమలవుతోంది. మిగతా చోట్ల అవస్థలు తప్పడం లేదు. పదో తరగతి విద్యార్థులకు ఈ రెండు నెలల పాటు కనీసం పండ్లు, పాలు, అల్పాహారం లాంటివి అందిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మధిరలోని పీవీఆర్‌ అండ్‌ ఎస్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ స్థానిక బాలికోన్నత పాఠశాల, సీపీఎస్‌ పాఠశాలల్లో ఈ సాయం అందిస్తోంది. అన్నిచోట్లా దాతలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


ఆకలితో ఏకాగ్రత చాలా కష్టం

డా.అనిల్‌కుమార్‌, మధిర, ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి

పదో తరగతి పిల్లలు మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం చేస్తుంటారు. తర్వాత తిన్న భోజనం దాదాపు 3గంటలకు పూర్తిగా జీర్ణమవుతుంది. ఇక సాయంత్రానికి వారిలో శక్తి బాగా తగ్గిపోతుంది. ఈ సమయంలో అదనపు తరగతులు నిర్వహించినా ఏకాగ్రత సరిగ్గా ఉండదు. గ్లూకోజ్‌ ఎక్కువ ఉండే పండ్లు లేదా బిస్కెట్లు, పాలు, రొట్టెలు అల్పాహారంగా అందించగలిగితే ప్రయోజనం ఉంటుంది.


కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం

సోమశేఖర శర్మ, ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతుల సమయంలో అల్పాహారం అందించాలని ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల నుంచి వినతులు వచ్చాయి. ఈ సమస్యను ఇప్పటికే కలెక్టర్‌ దృష్టికి సైతం తీసుకెళ్లాం. ప్రభుత్వ నిధుల నుంచి కానీ లేదా దాతల సహకారం తీసుకుని అందించేందుకు మా వంతుగా చర్యలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని