logo

భాషా పండితుల నిరసన బాట

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో భాషా పండిట్ల కేసు కోర్టు పరిధిలో ఉంది.

Published : 06 Feb 2023 05:48 IST

9, 10 తరగతులకు నిలిచిన బోధన
పదో తరగతి ఫలితాలపై ప్రభావం!

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో భాషా పండిట్ల కేసు కోర్టు పరిధిలో ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులు, పీఈటీలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా పండితుల అప్‌గ్రేడేషన్‌ సమస్య అలానే మిగిలిపోయింది. సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత గానీ భాషా పండితుల సమస్యలు పరిష్కారం కాలేదు. తమకు కూడా ఇదే షెడ్యూల్‌లో ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వారు నిరసన బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 8,574 మంది భాషా పండితులు, 1,852 మంది పీఈటీలు ఉన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 463 మంది భాషా పండితులు, 120 మంది పీఈటీలు పనిచేస్తున్నారు.


విద్యా హక్కు చట్టం ప్రకారం..

విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి ఉన్న వారే టీచర్లుగా పాఠాలు బోధించాలి. కొన్నేళ్ల నుంచి ఉన్నత పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఉర్దూను గ్రేడ్‌-2 భాషా పండితులతో బోధిస్తూ పండితుల శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనం మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే ఎస్‌జీటీలతో సమానంగా ఇస్తున్నారు. తమ వద్ద చదువుకున్న విద్యార్థులే ఉపాధ్యాయులుగా వచ్చి తమకే ప్రధానోపాధ్యాయులుగా మారుతున్నారని వారు వాపోతున్నారు. పండిట్‌ గ్రేడ్‌-2 ఉద్యోగం పొంది జీవితాంతం అదే గ్రేడ్‌-2గా పని చేసి ఎలాంటి ఉద్యోగోన్నతి లేకుండా ఉద్యోగ విరమణ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సర్వీసు రూల్స్‌ మార్చి...

ఉపాధ్యాయ సంఘాలు అనేక పోరాటాల ద్వారా జీవోలు 17, 18, 15లను మారుస్తూ ఫిబ్రవరి 2021లో ప్రభుత్వం రెండు మూడు జీవోలు, అక్టోబరు 2021లో జీవో నెంబరు 110 తీసుకొచ్చింది. ఈ జీవోలో పండితుల సర్వీసు రూల్స్‌ను మార్చి, భాషా పండితులు తెలుగు, హిందీ, ఉర్దూగా విధులు నిర్వహిస్తున్నవారే స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, హిందీ, ఉర్దూ భాష ఉపాధ్యాయులుగా అర్హులని జీవోలో పేర్కొన్నారు.


కోర్టు స్టేతో ఉద్యోగోన్నతులకు దూరం

పండితుల వజ్రాయుధం రెండు, మూడు, 110 జీవోలపై కొంతమంది ఎస్‌జీటీలు కోర్టుకు వెళ్లటంతో ఈ జీవోలపై స్టే విధించింది. స్టేను తొలగించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి, అధికారులకు మొర పెట్టుకున్నాయి. తొలగించకపోవటంతో ఇప్పుడు భాషా పండితులు ఉద్యోగోన్నతులకు దూరమయ్యారు.


జాబ్‌ఛార్ట్‌ ప్రకారం..

మొదటి రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలందజేశారు. ఈ నెల 1నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించటం నిలిపివేసి జాబ్‌ ఛార్ట్‌ అయిన 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మాత్రమే బోధిస్తున్నారు. పదో తరగతి ప్రత్యేక తరగతులు, పేపర్‌ మూల్యాంకనం కూడా బహిష్కరిస్తున్నారు.


వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి

వైకుంఠపు ఉమాదేవి, భాషా పండితుల ఐకాస జిల్లా కోకన్వీనర్‌

దశాబ్దాల వెట్టి చాకిరీ నుంచి భాషా పండితులను విముక్తి చేయాలి. తమ న్యాయమైన పోరాటానికి ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు సహకరించాలి. ఇదే షెడ్యూల్‌లో ఉద్యోగోన్నతులు కల్పిస్తే సీఎం కేసీఆర్‌ హామీని నెలబెట్టుకున్నట్లవుతుంది. కోర్టు కేసును తొలగించి ఉద్యోగోన్నతులు కల్పించాలి. ఉన్నత పాఠశాలల్లో ఎస్‌ఏలకు సమానంగా భాషా పండితులకు సమాన హోదా కల్పించాలి.


అసెంబ్లీలో చట్టం చేయాలి...

కొమ్మినేని అనిల్‌కుమార్‌, భాషా పండితుల ఐకాస జిల్లా సమన్వయకర్త

గతంలో సర్వీసు రూల్స్‌కు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉండగా ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి నం.95, 96 జీవోలు తీసుకొచ్చి వాటి ద్వారా 2005లో టీచర్లకు ఉద్యోగోన్నతులు ఇచ్చారు. అలాగే ప్రస్తుతం అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భాషా పండితులు, పీఈటీలకు ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని